టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు...చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. కొందరు నిరసనలు, ఆందోళనళకు దిగుతున్నారు. హైదరాబాద్ కేపీహెచ్ బీలో ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ కు వ్యతిరేకంగా సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినదించారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేపీహెచ్ బీ కాలనీలోని రోడ్ నెంబరు-1 వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఐటీ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా జై బాబు జైజై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. 


మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.  చంద్రబాబు అక్రమ అరెస్టును ఐటీ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. ఆయామ్‌ విత్‌ సీబీఎన్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. జై చంద్రబాబు జైజై చంద్రబాబు ప్లకార్డులను ప్రదర్శించారు. కక్ష సాధించేందుకే బాబును జైల్లో పెట్టారని,  ఆయన వల్లే  తమకు ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబుకు అండగా ఉంటామంటూ నినదించారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని సీఎం జగన్ ను హెచ్చరికలు జారీ చేశారు.