Jayaprada In Hyderabad: 30 ఏళ్ల క్రితం తెలుగు తెరపై కథానాయికగా వెలుగొంది, ఇప్పుడు ఉత్తరాది రాజకీయాల్లో బిజీగా ఉన్న మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జయప్రద హైదరాబాద్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు, పరిస్థితులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కొత్తగా ప్రారంభించిన స్కిన్ అండ్ హెయిర్ కేర్ క్లినిక్‌ను జయప్రద సోమవారం (మే 30) ప్రారంభించారు. అనంతరం జయప్రద మీడియాతో మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో రావాలని తనకు ఆసక్తిగా ఉందని జయప్రద అన్నారు. ఇక్కడి ప్రజలకు సేవ చేసుకొనే అవకాశం కోసం చూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నట్లుగా చెప్పారు. తమ పార్టీ పెద్దలు నిర్ణయించి ఆంధ్ర రాష్ట్రంలోగానీ, తెలంగాణలో గానీ పోటీ చేయమని చెప్తే తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తెలుగు బిడ్డగా వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం సరి కాదని జయప్రద అభిప్రాయపడ్డారు. మరింత సంపూర్ణమైన పాలన అందించి, ఇక్కడి ప్రజలకే అందుబాటులో ఉండాలని అన్నారు. అప్పుడే ప్రజలు టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను అభినందిస్తారని అన్నారు.
గత ఫిబ్రవరిలో జయప్రద తల్లి మరణం
జయప్రద పుట్టిన స్థలం రాజమండ్రి. ఆమె తల్లి నీలవేణి ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో చనిపోయారు. అప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు హుటాహుటిన వచ్చిన ఆమెకు పలువురు సినీ ప్రముఖులు సహా రాజకీయ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. అందంతో పాటు అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమనే కాకుండా భారతీయ చిత్ర సీమలో తన నటనతో చెరగని ముద్ర వేశారు జయప్రద. భూమి కోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించి మెప్పించారు. నటిగా జయప్రద 300 పైగా సినిమాల్లో నటించారు. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా జయప్రద రాణించారు.