Hyderabad News: ఇటీవలే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడం, అతడు చనిపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ తో పాటు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపల్, పట్టాభివృద్ధి శాఖ కార్యాలయంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషన్రలు, వెటర్నరీ విభాగం అధికారులతో కలిసి అర్వింద్ కుమార్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోజీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఐదున్నర లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, గతంలో 8 లక్షల 50 వేలు ఉండేవని స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ నిర్వహించడం వల్ల వాటి సంఖ్య ఐదు లక్షల 50 వేలకు తగ్గిందని అర్వింద్ కుమార్ తెలిపారు. అలాగే వాటికి వెంటనే ఏబీసీ స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించాలని, ఆయా కాలనీల్లో కొన్ని నీటి నిల్వ సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 


వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు


జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, చికెన్, మటన్ సెంటర్లు వ్యర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. నగరంలో కుక్కల సంఖ్యను నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పెంపుడు కుక్కలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకు సంబధించిన కరపత్రాలు, హోర్డింగులు సిద్ధం చేయాలని సూచించారు. నగర, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్లమ్ డెవలప్ మెంట్ ఫెడరేషన్స్, టౌన్ డెవలప్ మెంట్, రెసిడెంట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని తర మున్సిపాలిటీల్లో మెప్మా స్వయం సహాయక బృందంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. 


పెంపుడు కుక్కలకు ప్రత్యేక మొబైల్ యాప్


పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక మొబైల్ యాప్ ను సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సూచించారు. ఇందుకు సంబంధించిన "మై జీహెచ్ఎంసీ"యాప్, 040 21111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వివరించారు. అలాగే నగరంలో ఉన్న వీధి కుక్కల సంఖ్యను గుర్తించడానికి త్వరలో మొబైల్ యాప్ ను కూడా రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ యాప్ లో సంబంధిత యజమానులు నమోదు చేసుకోవాలని, తద్వారా గుర్తింపు కార్డును మంజూరు చేస్తామని చెప్పారు. ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో వెటర్నరీ బృందాలను తరలించి కుక్కలను కట్టడి చేయడానికి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మొన్న అంబర్ పేటలో జరిగినట్లుగా మరెక్కడా జరగకుండా చూడాలని చెప్పారు. అత్యంత బాధాకరమైన ఆ వార్త అందరినీ కలిచి వేస్తుందని.. మనం ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలే అలాంటి సమస్యలను తొలగిస్తాయని వివరించారు.