Hyderabad News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చి ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నగర వ్యాప్తంగా రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తోంది. ఫలితంగా ప్రయాణికులకు చాలా సమయం ఆదా అవుతోంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు తరహాలోనే లూప్‌లు ప్రవేశ పెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం.
ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా తలపెట్టిన 47 ప్రాజెక్టుల్లో 34 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఉప్పల్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ జంక్షన్ల మీదుగా చేపట్టిన సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్లు ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. తాజాగా బైరామల్ గూడ సెంకడ్ లెవెల్ ఫ్లై ఓవర్ తో పాటు రెండు లూప్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో బైరామల్ గూడలో లూప్ లు రావడం ఎస్ఆర్డీపీలో తొలి నిర్మాణంగా చెప్పుకోవచ్చు. ఎల్బీ నగర్, చంపాపేట, సాగర్ రింగు రోడ్డు మార్గాల వైపు వెళ్లేందుకుగానూ ఈ లూప్ లు ఎంతగానో దోహదపడుతున్నాయి. బైరామల్ గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ కు రూ.134.25 కోట్లు, బైరామల్ గూడ ఎల్ హెచ్ఎస్ లూప్ రూ.21.63 కోట్లు, బైరామల్ గూడ ఆర్ హెచ్ఎస్ లూప్ కు రూ.22.30 కోట్లతో నిర్మాణం జరుగుతుంది.
సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి రానున్న లూప్ లు
లూప్ లు, సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్లు వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు. బైరామల్ గూడలో రెండు ఫ్లైఓవర్ల ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ నుంచి కర్మాన్ ఘాట్ వైపునకు వెళ్లే వాహనాలకు.. అటు నుంచి ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకునే వారికి బైరామల్ గూడ చౌరస్తాలో ఫ్లైఓవర్లు పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే చాంద్రాయణగుట్ట ఓవైసీ దవాఖాన, కర్మాన్ ఘాట్ వైపు నుంచి బైరామల్ గూడ చౌరస్తాలో ఆగకుండా చింతలకుంట చెక్ పోస్టు, గుర్రంగూడ వైపు సాగర్ రోడ్డుకు చేరుకునేలా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఇది సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్. ఇప్పుడున్న ఫ్లైఓవర్ పై నుంచి సాగిపోతోంది. కర్మాన్ ఘాట్ రోడ్డు నుంచి మూడు లేన్లతో మొదలై చౌరస్తా వద్ద ఆంగ్ల అక్షరం వై ఆకారంలో రెండు వైపులా విడిపోతుంది. చింతలకుంట చెక్ పోస్టు రోడ్డుపైకి, మరొకటి సాగర్ రోడ్డుపైకి వాహనాలు వెళ్లనున్నాయి.
రెండు లూప్ ల నిర్మాణంతో ఆగకుండా ప్రయాణం
ఎల్బీ నగర్ నుంచి చంపాపేటకు, సాగర్ రింగు రోడ్డు నుంచి ఎల్బీనగర్ కు వెళ్లాలంటే చౌరస్తా వద్ద ఆగక తప్పడం లేదు. ఇందుకు పరిష్కారంగా రెండు లూప్ లను నిర్మిస్తున్నారు. సాగర్ రింగు రోడ్డు నుంచి ఎల్బీ నగర్ వెళ్లే వాహనాలు చౌరస్తా వద్ద ఆగి, గ్రీన్ లైట్ వెలిగాక కుడివైపుకు వెళ్లాలి. ఇక మీదట ఆగకుండా వెళ్లేలా సాగర్ రింగు రోడ్డు నుంచి వచ్చే వాహనాలను చంపాపేట రోడ్డు వైపుకు తీసుకెళ్లి ఎడమవైపుకు మళ్లించి, అప్ ర్యాంపు ద్వారా కర్మాన్ ఘాట్, ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కు సదరు వాహనాలు చేరనున్నాయి. ఎల్బీ నగర్ నుంచి చంపాపేట వెళ్లే వాహనాలు చౌరస్తా వద్ద ఆగి కుడివైపుకు మళ్లాల్సి ఉండేది. అలాంటిదేమీ లేకుండా ఎల్బీ నగర్ - కర్మాన్ ఘాట్ ఫ్లైఓవర్ పైకి వాహనాన్ని తీసుకెళ్లి, చౌరస్తా అవతల ఉండే డౌన్ ర్యాంపు మీదుగా సాగర్ రోడ్డు నుంచి చంపాపేట వైపు వెళ్లే రోడ్డుకు అనుసంధానం చేయనున్నారు.