Himayath Sagar Water Level: హైదరాబాద్‌ జంట జలాశయాలు ఉస్మాన్​‌సాగర్, హిమాయత్ సాగర్‌లు నిండు కుండలను తలపిస్తున్నాయి.​ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లలోకి వరద ప్రవాహం పెరిగింది. గురువారం రాత్రి నుంచి వస్తున్న వరదతో  హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి ప్రవాహం వస్తుండడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
ప్రస్తుతం హిమాయత్ సాగర్​కు 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. రెండు గేట్లను ఎత్తి 700 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జలమండలి అధికారులు హిమాయత్ సాగర్ జలాశయాన్ని పరిశీలించారు. 2 గేట్లను ఒక అడుగు వరకు ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు.
వరద నీరు విడుదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు.
జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 3 జిల్లాల్లో మ‌రో 24 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. వ‌ర‌ద‌లు, చెట్లు కూల‌డం సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబ‌ర్లను ఏర్పాటు చేసింది. ప్రజలు 040 21111111, 9000113667కు కాల్ చేసి సమస్యను తెలపొచ్చు. ఎక్కడైనా మ్యాన్‌హోల్‌ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా జలమండలి కస్టమర్‌ కేర్‌ నంబర్‌ 155313కి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. ప్రజలకు సహాయ సహకారం అందించేందుకు అందుబాటులో ఉంటామన్నారు.
భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో నగరంలో దాదాపు 16 ఈఆర్టీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఐదుగురు సిబ్బందితో పాటు ఇతర అత్యవసర సామగ్రి ఉంటుంది. ఆరు ఎస్పీటీ వాహనాలు, మరో 16 మినీ ఎయిర్‌టెక్‌ వాహనాలను 24 అందుబాటులో ఉంచారు.
మరో 24 గంటల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు పలు సూచనలు చేశారు. అవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాచిన నీటినే తాగాలని, నిల్వ చేసిన ఆహారం తీసుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. 
నగరంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ప్రస్తుత పరిస్థితులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆధ్వర్యంలో అధికారులతో మంత్రి తలసాని టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు.  హుస్సేన్ సాగర్‌‌కు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోందని, దిగువకు నీటి విడుదల జరుగుతోందని వివరించారు. వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరక  ముందే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై వెంట వెంటనే స్పందిస్తూ అవసరమైన సేవలను అందించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial