Hyderabad News: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడు నందకుమార్ కు చెందిన చెందిన అక్రమ నిర్మాణాలు జీహెచ్ఎంసీ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేసింది. నిర్మాత దగ్గుపాటి సురేశ్ బాబుకు చెందిన స్థలాన్ని నంద కుమార్ లీజుకు తీసుకున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా దక్కన్ కిచెన్ ప్రాంగణంలో రెండు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ విషయం నిర్మాత సురేష్ బాబు అధికారులు ఫిర్యాదు చేయగా.. స్పందించిన అధికారులు నందకుమార్ కు నోటీసులు ఇచ్చారు. అక్రమంగా నిర్మిస్తున్న భవనం నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలని తెలిపారు. అయినప్పటికీ నంద కుమార్ పట్టించుకోకపోవడంతో... ఫిలింనగర్ లో ఉన్న నందకుమార్ అలియాస్ నందు హోటల్ డెక్కన్ కిచెన్ భవనాన్ని కూల్చి వేస్తున్నారు. అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 



ఇటీవలే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహార కేసులో నంద కుమార్..


తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురులో ఒకరు అయిన నంద కుమార్.. ఆయన ఫాం హౌజ్ కు ఎందుకు వెళ్లారో తెలియజేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. పూజల కోసం మాత్రమే తాము ఫాం హౌస్ కు వెళ్లినట్లు వివరించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తనకు తెలియది చెప్పుకొచ్చారు. అంతే కాకుండా అక్కడ ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే తనకు తెలుసని నంద కుమార్ పేర్కొన్నారు. మిగతా ముగ్గురు వ్యక్తులు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. సింహయాజి స్వామీజీతో సామ్రాజ్య లక్ష్మి పూజ జరిపించడానికి బేరసారాలు జరిపినట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.


అసలు స్కాం గురించే తెలియదు..


అసలు స్కాం గురించి తమకు ఏమాత్రం తెలియదని నందకుమార్ వివరించారు. న్యాయాన్ని నమ్ముతున్నామని, న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని వివరించారు. త్వరలో మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అయితే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించిన కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ తిరస్కరించడంతో పోలీసులు తర్వాతి చర్యలు ఏం చేపడతారనేది ఆసక్తిగా మారింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి వారిని విచారించే అంశంపై పోలీసు అధికారులు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బులు చెల్లించి కొనేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ముగ్గురు నిందితులపై సైబరాబాద్‌ పోలీసులు కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముగ్గురు నిందితులపై 120-బీ, 171-బీ రెడ్‌ విత్‌ 171-ఈ, 506 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 8 ఆఫ్‌ ప్రివెన్షన్‌ కరప్షన్‌ యాక్ట్- 1988 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద రూ. కోట్ల డబ్బు ఉందని ప్రచారం జరిగినా కానీ, పక్కా ఆధారాలను పోలీసులు సమర్పించలేదు. కానీ జాతీయ స్థాయిలో ఒక కీలక నాయకుడి సెక్రటరీ మాట్లాడిన ఆడియో టేపులు లభించాయని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.