తెలంగాణలో కొద్ది రోజులుగా ఎమ్మె్ల్యేల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ దీనిపై విచారణ జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన వికారాబాద్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ మేరకు తనకు అపరిచిత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


తనకు ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన దాదాపు 11 నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్‌ వచ్చాయని ఫిర్యాదులో చెప్పారు. ఆ ఫోన్ కాల్స్ చేసిన వారిలో కొంత మంది తనను హత్య చేస్తామంటూ బెదిరించినట్టుగా రోహిత్‌ రెడ్డి పోలీసులకు చెప్పారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే మరో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.


ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సీక్రెట్ వీడియోలను సీఎం కేసీఆర్ విడుదల చేశాక ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. నలుగురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు ఎస్కార్ట్ లను కూడా కేటాయించింది. ఆ నలుగురు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర కూడా సెక్యురిటీని పటిష్ఠం చేసింది. అయితే, తాజాగా ఈ నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫైలట్ రోహిత్ రెడ్డి మాదాపూర్ ఏసీపీకి ఫిర్యాదు చేశాడు. 


విచారణ వేగవంతం


మరోవైపు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో​ సిట్‌ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్స్‌ ను సిట్‌ బృందం రికార్డు చేసింది. ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి నివాసానికి వెళ్లి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితులు తమను తొలుత ఎలా సంప్రదించారు అనే కోణంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తో కూడిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణ చేపట్టింది. రూ.100 కోట్ల డీల్‌పై ఫాం హౌస్‌లో​ ఏం మాట్లాడారనే అంశంపైన కూడా విచారణ జరుపుతోంది.


అక్టోబరు 26న వెలుగులోకి


ఇటీవల సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత నెల అక్టోబరు 26వ తేదీన ఈ కేసు వెలుగులోకి రాగా.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రామచంద్ర భారతితో పాటు మరో ఇద్దరు నంద కుమార్, సింహయాజిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీసులు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8తో పాటు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ అనే వ్యక్తే ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్ కు చెందిన నందకుమార్ సాయంతో పైలెట్ రోహిత్ రెడ్డిని పరిచయం చేసుకొని ఆయన ద్వారా టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్‌​లో పేర్కొన్నారు.