Minsiter Harish Rao : తెలంగాణ మంత్రి హరీశ్ రావు పోలవరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్లయినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాదన్నారు. పోలవరం నిర్మాణంపై అక్కడి ఇంజినీర్లపై మాట్లాడానన్న ఆయన... మరో ఐదేళ్లకు పూర్తయితే గొప్పేనని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పనులు కాళేశ్వరం కన్నా ముందే ప్రారంభం అయ్యాయన్నారు. అయితే పోలవరం ఇంకా పూర్తికాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు ఫలితాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం పంపులు ముంపు
ఏపీ తెలంగాణ మధ్య పోలవరం విషయం తరచూ చర్చనీయాంశం అవుతుంది. పోలవరం ప్రాజెక్టుతో భద్రాద్రి జిల్లాల్లో ముంపు వాటిల్లుతోందని తెలంగాణ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని చాలాసార్లు డిమాండ్ చేశారు. ఇటీవల గోదావరికి వరదలు వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం పంపులు మునగిపోవడానికి పోలవరం ప్రాజెక్టు కారణం అని వాదించింది. ఈ విషయం వివాదం అయింది. కేంద్రం దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సైతం అదే వాదనలను వినిపిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేప్పట్టలేదని అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాల్సిందేనని అంటున్నాయి. అదే విధంగా ముంపు నివారణకు రక్షణ చర్యలు సత్వరమే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
భద్రచలానికి ముప్పు
పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్ల భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని ఇటీవల తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఎన్నో గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ఈ డ్యామ్ వల్ల గోదావరి వరద ప్రవాహం నెమ్మది అవుతోందని, భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోందని చెప్పారు. పోలవరం డ్యామ్ ఎత్తును తగ్గించాలని గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని తాము కోరామని చెప్పారు. పోలవరం విషయంలో మొదటి నుంచి ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరారు. భద్రాచలం పక్కన ఉన్న ఐదు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుందని, పార్లమెంటులో బిల్లు పెట్టి వాటిని తక్షణమే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.