Hyderabad GHMC: రోడ్లపై మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనదారులకు చెక్ పెట్టేందుకు, వేగ నిరోధానికి ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్(మినీ స్పీడ్‌ బ్రేకర్స్) వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఇదే విషయాన్నినగర ప్రజలు మున్సిపల్ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా వివరించారు. ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్.. రంబుల్ స్ట్రిప్స్ వల్ల ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో నగరంలో రంబుల్ స్ట్రిప్స్ వేయరాదని జీహెచ్ఎంసీ ఈఎస్సీ జియావుద్దీన్.. ఎస్ఈ, ఈఈలకు సూచిస్తూ మెమో జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రంబుల్ స్ట్రిప్స్ వేయరాదని వెల్లడించారు. పాదచారుల భద్రత కోసం జీబ్రా క్రాసింగ్స్, స్టాప్ లైన్ల వంటి పనులు యథావిధిగా చేయవచ్చని వివరించారు.


నిజానికి రంబుల్ స్ట్రిప్స్ వల్ల వేగం తగ్గాలి. వాహనాల ప్రయాణం సాఫీగా సాగాలి. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో.. ముఖ్యంగా టీఎస్ఐఐసీ పరిధిలోని ప్రాంతాల్లో వేసిన రంబుల్ స్ట్రిప్స్ నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక మందంతో వేశారు. రంబుల్ స్ట్రిప్స్ మధ్య ఉండాల్సిన నిర్ణీత గ్యాప్ కూడా లేకుండా అడ్డదిడ్డంగా నిర్మించారు. ఎత్తుకూడా ఎక్కువగా వేశారు. ఇండియన్ రోడ్ కాంగ్సరెస్(ఐఆర్సీ) నిబంధనల మేరకు రంబుల్ స్ట్రిప్స్ మందం 5 మిల్లీ మీటర్లు కాగా.. నగరంలో కొన్ని చోట్ల 15 మిల్లీ నీటర్లు, అంతకంటే ఎక్కువ మందంతో నిర్మించారు. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 మిల్లీ మీటర్ల వరకు నిర్మించారు. ఇలా ఇష్టానుసారంగా వేశారు. దాంతో వాహనదారులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు నడుము, మెడలు దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులతో మంత్రి కేటీఆర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.... వాటిని సరిదిద్దే చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్, ఈఎస్సీలను ఆదేశించారు. నిబంధనల మేరకు రంబుల్ స్ట్రిప్స్ రెండు లేయర్లుగా 5 మిల్లీ మీటర్ల మందం, 5 మిల్లీ మీటర్ల ఎత్తులో, 200 మిల్లీ మీటర్ల వెడల్పులో ఉండాలని, ఒక్కో స్ట్రిప్ మధ్య తగిన గ్యాప్ తో ఆరు స్ట్రిప్ లు ఉండాలని సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు.