Ganesh Visarjan 2024: హైదరాబాద్ లో సెప్టెంబర్ 17న అధికారికంగా నిమజ్జనోత్సవం. అయితే నగరంలో నిన్నటి(ఆదివారం) నుంచే సందడి మొదలైంది. ఈరోజు కూడా ఆ సందడి కొనసాగే అవకాశం ఉంది. మంగళవారం పూర్తిగా నిమజ్జనోత్సవ సందడి ఉంటుంది. బుధవారం ఉదయానికి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనోత్సవం పూర్తయ్యే అవకాశముంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న తొలి నిమజ్జనోత్సవం కాబట్టి ఎక్కడా రాజీపడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అరేంజ్ మెంట్స్ లో నిమగ్నమయ్యారు. 


18వేలమందితో బందోబస్తు..
సెప్టెంబర్ 17న నిమజ్జనోత్సవంతోపాటు హైదరాబాద్ సంస్థానం విలీన దినోత్సవం కూడా నిర్వహిస్తారు. ప్రతిసారీ విలీనం, విమోచనం అంటూ గొడవ జరిగేది. ఈసారి ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు కూడా ఈరోజు జరుగుతాయి. అటు గణేష్ మండపాల వద్ద కూడా ఈరోజు సందడి భారీగానే ఉంటుంది. దీంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 18వేలమంది పోలీసులను బందోబస్తుకి వినియోగిస్తున్నట్టు తెలిపారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. అన్ని జోన్ ల డీసీపీలు, స్టేషన్ ఆఫీసర్లు, పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడొద్దని, గొడవలు చెలరేగకుండా చూడాలని ఆయన సిబ్బందికి సూచించారు. 


రాష్ట్ర డీజీపీ జితేందర్‌ కూడా గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇతర అధికారులతో కలసి ఆయన హైదరాబాద్ లోని ముఖ్యమైన మండపాలను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లపై ఆరా తీశారు. నిమజ్జనం రోజు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడాలని చెప్పారు. 



పోలీస్ డిపార్ట్ మెంట్ కాదు, ఇతర విభాగాలు కూడా నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. నిమజ్జనోత్సవానికి వచ్చే ప్రజలు, నిమజ్జనం తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్లేవారి కోసం 600 స్పెషల్ సర్వీస్ లు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసారు. ఇక రైల్వే కూడా రాత్రి వేళల్లో ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్ధమైంది. అటు మెట్రో సర్వీస్ ల సమయం కూడా పొడిగించారు. 


మరోవైపు పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై గందరగోళం కొనసాగుతోంది. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో నిమజ్జనాలకోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్రేన్లు పెట్టి, సిబ్బందిని అక్కడ ఉంచింది. అదే సమయంలో ట్యాంక్ బండ్ పై మాత్రం నిమజ్జనం విషయం ఆంక్షలున్నాయి. కానీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు నిన్ని ఆంక్షలను తొలగించుకుని ట్యాంక్ బండ్ పై కూడా నిమజ్జనం నిర్వహించారు. దీంతో మంగళవారం కూడా ఈ విషయంలో గందరగోళం నెలకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 


Also Read: అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి, హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్


70 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ట్రాలీ తీసుకొచ్చి విగ్రహాన్ని దానిపైకి తీసుకొచ్చేందుకు అరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. అర్థరాత్రితో ఖైరతాబాద్ లో దర్శనాలు నిలిపివేశారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వాహకులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. 


Also Read: గణేష్ నిమజ్జనం - నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్, ఆ రోజున అర్ధరాత్రి వరకూ సర్వీసులు