Hyderabad Traffic: హైదరాబాద్‌లో కీలకమైన గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను రాత్రి 11 గంటలకు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఎస్‌ఆర్‌డిపి శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 11 గంట నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఈ రోడ్లు మూసివేస్తున్నట్టు తెలిపారు.
గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై నుంచి రాత్రి టైంలో వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. గురువారం నుంచి ఈ ఫ్లైఓవర్ రాత్రి 11 నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూసివేస్తున్నారు. ఈ నెల 12 వ తేదీ వరకు ఇదే కొనసాగుతుందని అప్పటి వరకు ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇక్కడ నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లై ఓవర్ మూసివేయడంతో ఆ ఇబ్బంది రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని జీహెచ్‌ఎంసీ అభ్యర్థన మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించారు. ఈ ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాళ్లు పోలీసులు చెప్పిన రెండు రూట్లలో ఈజీగా గమ్యస్థానానికి చేరుకోవాలని తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులు చెప్పే రెండు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటంటే.. ఒకటి బయో-డైవర్సిటీ జంక్షన్ నుంచి IIIT జంక్షన్ వరకు వెళ్లడం. టెలికాం నగర్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకోవడం. అక్కడి నుంచి IIIT జంక్షన్‌కు వెళ్లొచ్చు. రెండోది IIIT జంక్షన్ నుంచి బయో-డైవర్సిటీ జంక్షన్ వరకు రూట్ క్లియర్ చేశారు. ఈ మార్గాలను ఉపయోగించి ఫ్లైఓవర్ లేకుండానే వాహనదారులు గమ్యాలకు చేరుకోవచ్చని అంటున్నారు.