హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని పర్యాటక ప్రాంతాల మీదుగా ఈ డబుల్ డెక్కర్ బస్సులను నడపాలని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ - హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ బుధవారం ట్వీట్ చేసి వెల్లడించారు. రూ.12.96 కోట్లతో గతంలోనే ఆరు డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్‌ఎండీఏ కొనుగోలు చేసింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో చాలా చోట్ల ఫ్లైఓవర్లు, మెట్రో స్టేషన్లు ఉన్నందున బస్సుల ఎత్తు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎత్తు విషయంలో ఇబ్బంది రాకుండా ఎట్టకేలకు కొన్ని రూట్లు ఎంపిక చేశారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, బిర్లా మందిర్, అసెంబ్లీ, సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీదుతోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్, తీగల వంతెన, దుర్గం చెరువు, గండిపేట పార్కు, గోల్కొండ, తారామతి బారాదరి తదితర ప్రాంతాల్లో నడపనున్నారు. ఉదయం ట్యాంక్ బండ్ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరుగుతూ తిరిగి ట్యాంక్ బండ్‌కు ఈ బస్సులు చేరుకుంటాయి. ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్ లోని సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ), సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేయించారు.
ఛార్జీలు ఎంతంటే..
కొద్ది రోజుల పాటు ఈ బస్సుల్లోకి ఫ్రీగానే అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి టిక్కెట్ అవసరం లేకుండా ఎక్కొచ్చు. అనంతరం కనీస ఛార్జీ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో ట్రిప్పుకు ఒక్కొక్కరికి రూ.50 చొప్పున వసూలు చేసే అవకాశం ఉంది. అయితే ఎప్పటి నుంచి టిక్కెట్ అందుబాటులోకి తేవాలనేది ఇంకా నిర్ణయించలేదు. టూరిస్టుల నుంచి వచ్చే స్పందనను బట్టి మరికొన్ని రూట్లు ఎంపిక చేసే అవకాశం ఉంది. వీటికి అదనంగా మరో 30 వరకు ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు తీసుకురానున్నట్లు గతంలో మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.