Hyderabad News: ఆలౌట్ సీసాలోని కెమికల్ ద్రావణం మొత్తాన్ని ఓ చిన్నారి తాగేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను హైదరాబాద్ వైద్యులు కాపాడారు. ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన 18 నెలల పాప తెలియక ఆలౌట్ సీసాలోని దోమల మందు మొత్తం తాగేసింది. ఆ మందు ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావం చూపడం మొదలుపెట్టడంతో.. ఛత్తీస్ గఢ్ రాయపూర్‌లోని వైద్యులు హైదరాబాద్ డాక్టర్ల సాయం కోరారు. కొండాపూర్ కిమ్స్ కడల్స్ ఆస్పత్రి డాక్టర్లు ఛత్తీస్ గడ్ లోని రాయపూర్ కు వెళ్లి ఆ చిన్నారికి వైద్యం చేసి బతికించారు.


ఆలౌట్ తాగిన చిన్నారికి ఊపిరి ఆడకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తినట్లుగా డాక్టర్లు తెలిపారు. చిన్నారి ఆ కెమికల్ ద్రావణం తాగిందని తెలుసుకున్న తల్లిదండ్రులు.. తొలుత స్థానికంగా ఉన్న ఆస్పత్రికి, తర్వాత అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లారు. రాయపూర్ ఆస్పత్రి డాక్టర్లు చిన్నారిని వెంటిలేటర్ పై ఉంచి.. చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆమె ఊపిరితిత్తుల పరిస్థితి బాగుపడకపోవడంతో ఆమెకు సరిగా ఊపిరి అందలేదు. దాంతో రాయపూర్‌ ఆస్పత్రి వర్గాలు హైదరాబాద్ కిమ్స్ కడల్స్ ఆస్పత్రి సాయం కోరారు.


అలా హైదరాబాద్ నుంచి ఇద్దరు ఊపిరితిత్తుల నిపుణులు, ఒక పెర్ఫ్యూజనిస్టు, ఒక కార్డియాక్ సర్జన్, ఐసీయూ నర్సు కలిసి రాయ్‌పూర్‌కు వెళ్లి.. సదరు ఆస్పత్రిలో చిన్నారికి వైద్యం అందించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు.. ఆలౌట్‌లోని హైడ్రోకార్బన్స్ కారణంగా కెమికల్ న్యూమోనైటిస్ అనే సమస్య ఏర్పడిందని అవగాహనకు వచ్చారు. ఆ కారణంగా చిన్నారి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం.. ఉన్న వెంటిలేటర్ సరిపోకపోవడంతో ఆమె కుడివైపు గుండె కూడా క్రమంగా దెబ్బతింటున్న విషయాన్ని గుర్తించారు. దాంతో ఆ పాపకు ఎక్మో (Extracorporeal Membrane Oxygenation) పెట్టి, ఊపిరితిత్తులు చేసే పనిని యంత్రం చేసేలా చేసి.. ఆ చిన్నారి లంగ్స్ ను మెరుగుపర్చేలా చేశారు. 


చిన్నారి బరువు కేవలం 10 కిలోలు మాత్రమే ఉన్నందున, ఎక్మో యంత్రపు ట్యూబులను మెడ గుండా లోనికి పంపారు. ఇది ఊపిరితిత్తులు, గుండె రెండింటినీ బైపాస్ చేస్తుందని డాక్టర్లు తెలిపారు. ఈ విధానం చాలా అరుదని చెప్పారు. ఈ ప్రొసీజర్ అక్కడ చేసిన తర్వాత చిన్నారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా కొండాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపకు 9 రోజుల పాటు ఎక్మో మీద పెట్టాక పరిస్థితి మెరుగుపడడంతో మరో ఐదారు రోజులు సాధారణ వెంటిలేటర్ మీద ఉంచారు. 18 రోజుల చికిత్స తర్వాత పాప పూర్తిగా కోలుకుందని.. ఆమెను డిశ్చార్జి కూడా చేశామని డాక్టర్లు తెలిపారు. మెడ వద్ద కాన్యులా పెట్టి తరలించడం భారతదేశంలోనే అత్యంత అరుదైనదని డాక్టర్లు చెప్పారు.