Borabanda SHO Ravi Kumar attached to CPs office:
హైదరాబాద్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా బోరబండ ఇన్‌స్పెక్టర్‌పై వేటు పడింది. బోరబండ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ను హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య సీపీ ఆఫీస్‌కి అటాచ్ చేశారు. రవికుమార్ పై ఇదివరకే పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పలు కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బోరబండ పోలీస్ స్టేషన్‌లో తనిఖీలు చేపట్టిన అనంతరం ఇన్ స్పెక్టర్ రవికుమార్ పై వేటు వేశారు. కొన్ని రోజుల్లోనే ఎన్నికలు ఉండటం, మరోవైపు రౌడీ షీటర్ల రికార్డ్ మెయింటైన్ చేయలేదని సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ కు వచ్చే వారితో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని గుర్తించినట్లు తెలుస్తోంది. మహిళలపై వేధింపులు జరిగిన కేసులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు చేశారనే అభియోగాలు కూడా ఉండటంతో ఇన్ స్పెక్టర్ రవికుమార్ ను సీపీ ఆఫీసుకు అటాట్ చేశారు. ఎన్నికల వేళ పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని తాజా నిర్ణయంతో పోలీసులకు సంకేతాలు పంపారు.
హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఎస్సార్ నగర్, మధురా నగర్ పోలీస్ స్టేషన్లలోనూ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్సార్ నగర్ పీఎస్ పరిధిలో ఓ రౌడీ షీటర్ మహ్మద్ సర్వార్ షరీఫ్ అనే నిందితుడు తరుణ్ నాయక్ అనే యువకుడ్ని దారుణంగా హత్య చేయడం తెలిసిందే. స్థానికంగా కొన్ని విషయాలపై గొడవ జరిగి హత్యకు దారితీసినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయం కనుక పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులపై నిఘా పెంచాలని సీపీ సూచించారు.