ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తారు? ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తారు. అందుకోసం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లడమో లేక ముందు డయల్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేయడమో చేస్తారు. ఆ తర్వాత వారు చర్యలు తీసుకుంటుంటారు. అదే సమస్య పోలీస్ బాస్ కి ఎదురైతే, తన సిబ్బందికి చెప్పి క్షణాల్లో సమస్య పరిష్కారం చేయిస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ఈ పోలీస్ బాస్ సామాన్యుడిలాగా డయల్ 100 కి ఫిర్యాదు చేశారు. ఆయనెవరో కాదు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.


హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం అర్ధరాత్రి డయల్ 100కు కాల్ చేశారు. తన నివాస ప్రాంతంలో సౌండ్ పొల్యూషన్ ఆపాలని డయల్ 100 ద్వారా సీపీ ఈ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ప్లజెంట్ వ్యాలీలో సీపీ ఆనంద్ నివాసం ఉంటుండగా, ఆ ప్రాంతంలో అర్ధరాత్రి తీవ్రమైన శబ్ద కాలుష్యం ఏర్పడింది. ఎవరో డప్పుల చప్పుడుతో ఆ సమయంలో సంబరాలు చేసుకున్నారు. దీంతో సీపీ సీవీ ఆనంద్ అర్ధరాత్రి డప్పుల హోరుతో శబ్ద కాలుష్యం చేస్తున్నారని డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారు. 


డయల్ 100 ద్వారా సమాచారం తెలుసుకున్న నైట్ డ్యూటీలో ఉన్న జూబ్లీహిల్స్ డీఐ శ్రీనివాస్, ఇతర సిబ్బంది వెళ్లి విషయం తెలుసుకున్నారు. ఓం నగర్ బస్తీలో తొట్టెలు ఊరేగిస్తూ అర్ధరాత్రి డప్పులతో శబ్ద కాలుష్యం చేసినట్లు గుర్తించారు. వెంటనే నిర్వహకుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని 70 b కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 


సీపీ తలచుకుంటే నేరుగా తన సిబ్బందికే ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ, ఇలా డయల్ 100 కు ఫోన్ చేసి సమస్య పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.


Also Read: Guntur News: కన్న కొడుకుని చంపి, గుట్టుగా పాతేసిన తల్లిదండ్రులు - ఎందుకో తెలిసి గ్రామస్థులు షాక్!