Hyderabad Latest News: హైదరాబాద్‌లో సోమవారం (ఆగస్టు 20) సాయంత్రం నుంచి తీవ్రమైన వర్షం మొదలైంది. దట్టంగా కమ్ముకున్న మేఘాల కారణంగా కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సిటీలో భారీ వర్షాలు ముఖ్యంగా కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి శేరిలింగంపల్లి, నిజాంపేట్, మియాపూర్, ఖైరతాబాద్, షేక్‌పేట్, ఆసిఫ్ నగర్, కాప్రా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.


షాపూర్ నగర్, గుండ్ల పోచంపల్లి, జీడిమెట్ల, సుచిత్ర, అబిడ్స్ , బషీర్ బాగ్, హిమాయత్ నగర్, పెట్ బషీరాబాద్, పీర్జాదిగూడ, ఉప్పల్, బోడుప్పల్, దుండిగల్, గండి మైసమ్మ, సూరారం, నారాయణ గూడ, లక్డీ కపూల్ ప్రాంతాల్లో బాగా వర్షం పడింది. 


ఆగస్ట్ 20న ఉదయం వర్షం పడగా.. మధ్యాహ్నానికి కాస్త ఎండ రావడంతో అంతా కాస్త ఊరట చెందారు. మళ్లీ సాయంత్రానికి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చీకట్లు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాలలో వర్షంతో పాటు ఎండ కూడా కనిపించింది. భారీ వర్షం కారణంగా ఇప్పటికే రోడ్లన్నీ జలమయం కాగా.. లోతట్టు ప్రాంతాల్లో నీరు పోవడం లేదు. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో ఉద్యోగులు అంతా ఆందోళన చెందుతున్నారు.


నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్


మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్, సుచిత్ర, షాపూర్ నగర్, సూరారం, దుండిగల్, బాచుపల్లి, ప్రగతి నగర్ సహా పలు ప్రాంతాలలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీళ్లు చేరాయి. దీంతో వాహనదారులు పాదాచారులు ఇబ్బంది పడ్డారు. కండ్లకోయ నుంచి సుచిత్ర వెళ్ళే 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. వర్షం కారణంగా రోడ్లపై వాహనాలు దారిపొడవునా నిలిచిపోగా.. వాహనదారులు అవస్థలు పడ్డారు.