Hyderabad City Police about closing shops at 10:30 PM In Hyd | హైదరాబాద్: నైట్ కల్చర్ పెరగడంతో హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేటు సైతం పెరిగిపోయిందని, ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ప్రచారం జరిగింది. అందులో భాగంగా రాత్రి 10.30 నుంచి 11 మధ్య షాప్‌లు క్లోజ్ చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రాత్రి ఆ టైమ్ దాటిన తరువాత షాప్ లో ఓపెన్ చేసి ఉంటే చర్యలు తీసుకుంటారని సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. దీనిపై స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీసులు ఆ వార్తల్లో నిజం లేదని తేల్చేశారు.
హైదరాబాద్ లో రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారనేది పూర్తిగా తప్పు పట్టించే వార్త అన్నారు. నగరంలో దుకాణాలు, సంస్థలు తెరవడం, మూసివేసే టైమింగ్స్ ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేశారు. నగర వాసులు ఈ విషయాన్ని గమనించాలని హైదరాబాద్ సిటీ పోలీసులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నగరంలో ఎలాంటి కొత్త రూల్స్ ప్రవేశపెట్టలేదని క్లారిటీ ఇచ్చారు.
క్రైమ్ రేటు పెరుగుతోందంటూ ప్రచారం !
నగరంలో గత కొన్ని రోజుల నుంచి వరుస దాడులు, హత్యలు జరుగుతున్నాయి. దానికి సిటీ నైట్ కల్చర్ కారణమని పోలీస్ శాఖ, జీహచ్ఎంసీ అధికారులు గుర్తించారని.. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరిగింది. రాత్రివేళ ప్రజలు రోడ్ల మీద సంచరించడంతో క్రైమ్ రేటు పెరిగిపోయిందని, షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలు, వ్యాపార సముదాయాలు సాధ్యమైనంత త్వరగా మూసివేస్తే సానుకూల ప్రభావం ఉంటుందని భావించినట్లు పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ కారణంగా రాత్రివేళ పదిన్నర లేదా పదకొండు గంటలకు అన్ని వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని అంతా భావించారు.
అలాంటి వదంతులు నమ్మవద్దన్న పోలీసులు
అర్ధరాత్రి నగరంలో మార్కెట్ బాగానే జరుగుతుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో తమ బతుకుదెరువు ఎలా అని వ్యాపారులు ఆందోళన చెందారు. హైదరాబాద్ సిటీలో నైట్ షాపింగ్ చేసే వారికి సైతం ఇది షాకింగ్ న్యూస్ అంటూ ప్రచారం జరగగా.. అవన్నీ వదంతులేనని సిటీ పోలీసులు తెలిపారు. ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మకూడదని.. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన, ఎవరైనా అధికారి, పోలీసులు ప్రకటన విడుదల చేస్తే విశ్వసించాలని నగరవాసులకు హైదరాబాద్ పోలీసులు సూచించారు. బ్యాచిలర్స్ కు రాత్రిపూట ఫుడ్ దొరుకుతుంది, ఇక ఏ ఇబ్బంది లేదంటూ పోలీసుల పోస్టుపై యువత స్పందిస్తున్నారు. క్రైమ్ రేటు పెరగడానికి రాత్రివేళ షాపులు, సంస్థలు తెరుచుకుని ఉండటానికి ఏ సంబంధం లేదని కామెంట్లు చేస్తున్నారు.