హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల స్థానంలో నెమ్మదిగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నట్లుగా గతంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎలక్ట్రిక్ సిటీ బస్సులు రావడానికి సమయం ఆసన్నమైంది. మరో రెండు వారాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు హైదరాబాద్ రోడ్లెక్కనున్నాయి. ఈ బస్సులను ముందు ఏఏ మార్గాల్లో తిప్పాలనే విషయంలో అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.


హైదరాబాద్ మెట్రో, ఎంఎంటీఎస్‌ రైలు సౌకర్యం లేని మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అంతేకాకుండా, ముందు ఐటీ కారిడార్‌ను కనెక్ట్ చేయడానికి ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్‌, మియాపూర్‌, కంటోన్మెంట్ డిపోలకు ఈ బస్సులను కేటాయిస్తారని సమాచారం. ఈ మేరకు ఆ డిపోల పరిధుల్లో బస్సుల రూట్లను నిర్ణయించారు.


బస్సులకు ప్రత్యేక యాప్
ఎలక్ట్రిక్‌ బస్సుల్లో జీపీఎస్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సు పేరుతో తయారు చేసే ప్రత్యేక యాప్‌తో వాటిని కనెక్ట్ చేయనున్నారు. ఆ బస్సులు తిరిగే మార్గాల్లో ప్రతి అర గంటకి ఓ బస్సు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.


ఎలక్ట్రిక్ బస్సుల రూట్లు ఇవే
సికింద్రాబాద్‌ - బేగంపేట - పంజాగుట్ట - ఎల్వీ ప్రసాద్ - జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు - ఫిల్మ్‌నగర్‌ - ఉస్మానియా కాలనీ - మణికొండ రూట్ లో తిరుగుతున్న 47ఎల్‌ బస్సు స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. జూబ్లీ బస్ స్టేషన్ - సికింద్రాబాద్‌ - తార్నాక - హబ్బిగూడ - ఉప్పల్‌ - నాగోల్ - ఎల్‌బీ నగర్‌ - ఇబ్రహీంపట్నం మార్గంలో కూడా కంటోన్మెంట్‌ డిపోకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపించనున్నారు. 


మియాపూర్‌ డిపోకు కేటాయించే వాటిలో ఎలక్ట్రిక్ బస్సులను బాచుపల్లి - నిజాంపేట్ - జేఎన్‌టీయూ - కేపీహెచ్‌బీ - హైటెక్‌ సిటీ - మైండ్ స్పేస్ జంక్షన్ - బయోడైవర్సిటీ - గచ్చిబౌలి - వేవ్‌రాక్‌ మార్గాల్లో తిప్పనున్నారు. ప్రగతి నగర్‌ - జేఎన్‌టీయూ - హైటెక్‌సిటీ - బయోడైవర్సిటీ - గచ్చిబౌలి - వీబీఐటీ మార్గాల్లో కూడా నడిపించనున్నారు.