Hydra Demolitions in Hyderabad Old City | పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఇలాక అయిన చాంద్రాయణ గుట్టలో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. అక్బర్ నగర్‌లో ఆక్రమించి నిర్మించుకున్న షాపులను భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. అయితే వెనక్కి వెళ్లిపోవాలని, తమ ఏరియా జోలికి రావొద్దని పాతబస్తీ వాసులు, పోలీసులతో వాగ్విదానికి దిగడంతో హైడ్రా కూల్చివేతలకు ఆటంకం తలెత్తింది.
అక్బరుద్దీన్ ఒవైసీ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని అక్బర్ నగర్ ప్రాంతంలో హైడ్రా సిబ్బంది అక్రమ నిర్మాణాలను కూల్చివేత చర్యలు చేపట్టారు. నగరపాలక అధికారులు, భారీ పోలీసు బందోబస్తుతో హైడ్రా సిబ్బంది అక్బర్ నగర్‌లో అక్రమ నిర్మాణాలు, షాపుల కూల్చివేత చేపట్టింది. ఈ క్రమంలో స్థానికులు హైడ్రా సిబ్బంది పనులను అడ్డుకున్నారు. పోలీసులు వారిని వారించి పక్కకు జరిపే ప్రయత్నం చేయగా.. పోలీసులకు, స్థానికులకు మధ్య నెలకొన్న వాగ్వాదం తోపులాటకు దారితీసింది.
కొందరు స్థానికులు ప్రతిఘటిస్తూ హైడ్రా కూల్చివేతలు చేపట్టిన జేసీబీకి ఎదురుగా నిలిచారు. కొందరు జేసీబీ ఎక్కి అడ్డుకునే ప్రయత్నం సైతం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, స్థానికులకు మధ్య వాగ్వాదం మరింత ముదిరి తోపులాట చోటుచేసుకుంది.
హైడ్రా చర్యలను వ్యతిరేకిస్తూ AIMIM పార్టీ కార్పొరేటర్లు, నేతలు హైడ్రా, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా వచ్చి కూల్చివేతలు చేపట్టం ఏంటని, ప్రభుత్వం తీరు, హైడ్రాల తీరు సరికాదని ఆందోళనకు దిగారు. కూల్చివేతలు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఎంఐఎం కార్పొరేటర్లు, నేతలు, స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.