Hyderabad Chicken Price: మీరు మాంసాహార ప్రియులా? అయితే మీకు చేదువార్త. చికెన్ ధరలు (Chicken Price) విపరీతంగా పెరిగిపోతున్నాయి. మాంసాహారంలో కాస్త అందుబాటులో ఉండే ధర చికెన్ మాత్రమే. మంచి రకం చేపలు, మేక మాంసం వంటివి కిలో రూ.600 పైమాటే. ఇప్పుడు చికెన్ ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే రూ.100 పెరిగింది. గతంలో కిలో చికెన్ రూ.175 ఉండగా ఇప్పుడు మాత్రం ఏకంగా రూ.280 అయింది. ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా తెలంగాణలో సగటున రోజుకు 10 లక్షల కిలోల కోడి మాంసం అమ్ముతున్నారని ఓ అంచనా. ఇక ఆదివారం 15 లక్షల కిలోల వరకూ అమ్మకాలు ఉంటున్నాయి. ఇలా ధరలు పెరిగేందుకు ప్రధాన కారణం.. వాతావరణ మార్పు అని చెబుతున్నారు. శీతకాలం ముగిసి వేసవి రావడం, వాతావరణంలో వేడి పెరిగిపోవడంతో ఆ ఉష్ణోగ్రతలకు కోడి పిల్లలు ఎక్కువగా చనిపోతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇప్పుడే 37 నుంచి 39 డిగ్రీల వరకూ నమోదు అవుతున్నాయి. ఆ కోడి పిల్లలకు దాణాగా వేసే సోయాచెక్క, మొక్కజొన్న, ఇతర ధాన్యపు గింజల ధరలు కూడా పెరిగిపోవడంతో మాంసం ధరలు కూడా పెరిగిపోయాయి. ఎండలు ఇంకా ముదిరి కోళ్ల మరణాలు పెరిగితే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్వింటాల్ సోయాచెక్క దాణా ధర ఏడాది క్రితం రూ.4 వేల నుంచి రూ.5 వేలు ఉండగా ప్రస్తుతం రూ.7,200 గా ఉంది. ఈ కారణాలతో మాంసం ధర పెరిగింది.
తగ్గిన నాటు కోళ్ల లభ్యత (Desi Chicken Rate)
సాధారణ చికెన్ ధర రూ.280కి చేరగా.. నాటు కోడి చికెన్ (Country Chicken Rate in Hyderabad) ధర కిలో రూ.400 నుంచి రూ.500 పైగా చేరింది. నాటు కోళ్ల లభ్యత లేకపోవడంతో ధర అమాంతం పెరిగిందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ అడవుల్లో పెరిగే కడక్ నాథ్ కోళ్లను కొందరు వ్యాపారులు తెచ్చి.. ఇక్కడి ఫారాల్లో పెంచి కిలో మాంసం రూ.500కి అమ్ముతున్నారు. ఈ మాంసంలో పోషకాలుంటాయనే ప్రచారంతో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ధర పెరిగేందుకు ఇది కూడా కారణంగా తెలుస్తోంది.
ప్రతి వేసవిలో చికెన్ ధరలు పెరుగుతుండడం సహజమేనని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎండల వేడి తట్టుకోలేక కోళ్లు చనిపోవడం కూడా మామూలే అని అందుకే ధరలు ఈ సమయంలో పెరుగుతుంటాయని పౌల్ట్రీ నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ తగ్గితే ఆటోమేటిగ్గా ధరలు దిగివస్తాయని అంటున్నారు. కానీ, గతేడాదితో పోల్చితే ఈసారి మొత్తం చికెన్ ధరలు భారీగా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ కిలో రూ.350 నుంచి రూ.400 వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని లేదని పౌల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.