Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్(Tamilisai soundararajan) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు సరైన గౌరవం దక్కడంలేదన్న ఆమె, ఉన్నత పదవుల్లో ఉన్నవారికీ గౌరవం దక్కడం లేదన్నారు. "నన్ను ఎవరు భయపెట్టలేరు. నేను దేనికీ భయపడను" అని గవర్నర్ తమిళి సై అన్నారు.
గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళి సై అసంతృప్తి
ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి గవర్నర్ ప్రసంగం లేకపోవడం వివాదాస్పంద అయింది. దీనిపై గవర్నర్ తమిళి సై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం(Governor Speech) లేకపోవడంపై తమిళిసై ఇటీవల స్పందించారు. బడ్జెట్ సమావేశాల్లో(Budget Session) గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ(Assembly) సమావేశాల కొనసాగింపులో భాగంగానే బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ప్రభుత్వం చెప్పడం సరికాదని గవర్నర్ అన్నారు. ఐదు నెలల తర్వాత సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం, గత సమావేశాల కొనసాగింపు అనడం రాజ్యాంగానికి విరుద్ధం అన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించడమే అని తమిళి సై అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్(Governor) కోరారు. రాజకీయాలకు అతీతంగా ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశామన్నారు. సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉందని తమిళి సై అన్నారు.
యాదాద్రిలో గవర్నర్ పర్యటన
ఇవాళ యాదాద్రిలో పర్యటించిన ఆమెకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత స్వాగతం పలికారు. గవర్నర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించి యాదాద్రి ప్రధానాలయాన్ని సందర్శించారు. స్వయంభు మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు వటపత్రసాయి అలంకార సేవలో లక్ష్మీ నరసింహస్వామి వారిని గవర్నర్ తమిళి సై దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. వేద పండితులు గవర్నర్ కు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో పర్యటించి నూతన నిర్మాణాల విశేషాలు అడిగి తెలుసుకున్నారు.
యాదాద్రి ఆలయం ఓ అద్భుతం
యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని గవర్నర్ తమిళి సై అన్నారు. యాదాద్రికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని గవర్నర్ అన్నారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలకు సంతోషం కల్పించాలని స్వామి వారిని కోరుకున్నానన్నారు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యానని, మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాలు లక్ష్మీసమేత నారసింహుడు బాలాలయంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈనెల 14న ముగుస్తాయి. స్వయంభువులైన పంచనారసింహుల ఆలయ పునర్నిర్మాణం జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన బాలాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.