Nirmal Road Accident:  తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. భైంసా మండలం తిమ్మాపూర్‌ వద్ద హైవేపై సోమవారం రెండు ఆర్టీసీ బస్సులు(RTC Buses) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాల ప్రకారం... భైంసా నుంచి నిర్మల్‌ వెళ్తోన్న ఆర్టీసీ బస్సును అదే మార్గంలో గొల్లమడ వెళ్తోన్న మరో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని భైంసా(Bhainsa) ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంబకంటికి చెందిన చిన్నత్త, గోదావరికి కాళ్లు విరగడంతో వారిని మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌ తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


భైంసాలో మరో రోడ్డు ప్రమాదం, పదో తరగతి విద్యార్థి మృతి 


నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బస్ డిపో సమీపంలో లారీ ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యార్థులు పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు గుర్తించాు. మృతుడు గణేష్, క్షతగాత్రుడు అక్షిత్ కుబీర్ గ్రామానికి చెందిన వారు కాగా, మరో విద్యార్థి శ్రీనివాస్ భైంసాలోని రాహుల్ నగర్‌కు చెందిన వారు. తీవ్రగాయాలైన ఇద్దరిని ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ​కు తరలించారు. గణేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం


నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చెపూర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కారు నిర్మల్ నుంచి ఆర్మూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు రాము(22), జ్ఞానేశ్వర్ గౌడ్(30)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి  పోలీసులు దర్యాప్తు చేపట్టారు.