Chandrayangutta Flyover: హైదరాబాద్‌లో తాజాగా నిర్మించిన చాంద్రాయణ గుట్ట విస్తరణ ఫ్లైఓవర్ ను రాష్ట్ర హోం మంత్రి మహమ్ముద్‌ అలీ ప్రారంభించారు. విశ్వ నగరంలో మరో కలికితురాయిగా చాంద్రాయణగుట్ట నిలవబోతుందంటూ ఆయన వివరించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా అవసరమైన చోట ప్రభుత్వం ఫ్లైఓర్లను నిర్మిస్తుందని మంత్రి తెలిపారు. 674 మీటర్ల పొడువు ఉన్న ఈ ఫ్లైఓవర్ ను రూ.45.90 కోట్ల వ్యయంతో నిర్మించారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో కింద హైదరాబాద్ నగరంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది.  




41 పనులు చేపట్టగా.. 30 పనులు పూర్తి!


హైదరాబాద్ లో ఎస్ఆర్డీపీ చేపట్టిన పనులన్నీ ఒక్కొక్కటిగా అదుబాటులోకి వస్తున్నాయి. మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ కూడా తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలోనే ఎస్ఆర్డీపీ ద్వారా నగరంలో నలువైపులా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన 41 పనుల్లో దాదాపు 30 పనులు పూర్తయ్యాయి. మిగతా వాటిని కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు భాగ్య నగరంలో మొత్తం 15 ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకే ఫ్లైఓవర్ల నిర్మాణం, ఫ్లై ఓవర్ల విస్తరణ, అండర్ పాసులు, ఆర్ఓబీలు చేపట్టింది. 










15 ఫ్లైఓవర్లు పూర్తి..!


ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.8052.92 కోట్లతో మొత్తం 41 పనులు చేపట్టారు. ఇప్పటికే రూ.3748.85 కోట్ల విలువైన 30 పనులు పూర్తయ్యాయి. ఇందులో 15 ఫ్లైఓవర్లు, నాలుగు అండర్ పాసులు, మరిన్ని ఆర్ఓబీలు, ఆర్ యూబీలు ఉన్నాయి. కొత్తగూడ, ఆరాంఘర్, ఇందిరా పార్కు- వీఎస్టీ, బైరామల్ గూడ, నాగోల్ తదితర ప్రాంతాల్లో వంతెనెల నిర్మాణం పురోగతిలో ఉంది. చౌరస్తాల వద్ద సిగ్నల్ చిక్కులు లేకుండా వాహనాల రాకపోకలు సాఫీగా సాగడమే ఎస్ఆర్డీపీ ప్రధాన ఉద్దేశం. అయితే చాంద్రాయణ్ గుట్ట ఫ్లైఓవర్ వల్ల ఎల్బీనగర్, ఒవైసీ ఆస్పత్రి, సైదాబాద్, మలక్ పేట్, నల్గొండ ఎక్స్ రోడ్‌ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు ఇక సిగ్నల్ వద్ద ఆగకుండానే సాగిపోయే అవకాశం ఉంటుంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ చాంద్రాయణ గుట్ట తొలి దశ పనులకు 2018లో అనుమతిని ఇచ్చింది. ఒక ఏడాదిలోనే నిర్మాణం కూడా పూర్తయింది. ఈ తర్వాత చేపట్టిన విస్తరణ పనులు కూడా పూర్తయి నేడు పూర్తి అందుబాటులోకి వచ్చింది. 


ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ మీదు ఉప్పల్ వరకు మొత్తం 7 ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణాన్ని చేపట్టారు. ఆరాంఘర్ నుంచి మీర్ ఆలం ట్యాంకు వరకు నిర్మించే ఫ్లైఓవర్ జీహెచ్ఎంసీలోని అతి పొడవైన ఫ్లైఓవర్. దాని నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇక నాగోల్ వద్ద చేపట్టిన ఫ్లైఓవర్ పనులు తుది దశకు చేరాయి. ఈ నేపథ్యంలో ఆరాంఘర్ నుంచి ఉప్పల్ జంక్షన్ వరకు రవాణా మెరుగు పరచడమే కాకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థకు దోహద పడుతుంది.


ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్‌ నేతలు, ఎంఐఎం నేతలు పాల్గొన్నారు.