Revanth Reddy: దేశానికి హైదరాబాద్ రెండో రాజధానిగా ప్రతిపాదన వస్తే పార్టీలో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది అంత ఆషామాషీ అంశం కాదన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయ వనరులు రాష్ట్రానికి చెందేలా కేంద్రానికి చెందేలా అన్న అంశంపై చర్చించాల్సి ఉందని అన్నారు. అదే కాకుండా అధికారుల విషయంలోనూ విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై స్పష్టత కోసం సంబంధిత మేధావులతో ఆధ్యాయనం జరగాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు.
రెండో రాజధానిగా హైదరాబాద్.. బీజేపీ పక్కా ప్లాన్
హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేయాలన్న అంశాన్ని మెల్లగా ప్రజల్లో పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండో రాజధాని చేయాలంటే.. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాల్సి ఉంటుంది. హఠాత్తుగా.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ అంశాన్ని లేవనెత్తారు. గవర్నర్ గా పదవి కాలం ముగిసిన తర్వాత సైలెంట్ ఉన్న ఆయన హఠాత్తుగా తెరపైకి వచ్చారు. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలన్నారు. అంబేద్కర్ కూడా అదే కోరుకున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై పార్టీలన్నీ ఆలోచించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగినప్పుడు సీఎం కేసీఆర్ సమక్షంలోనే అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్.. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయడం అంబేద్కర్ స్వప్నమన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయలేదు. కానీ అలాంటి ఆలోచన బీజేపీకి ఉందని తర్వాత పరిణామాలతో వెల్లడవుతూ వస్తోంది.
తరచూ చర్చల్లోకి వస్తున్న రెండో రాజధాని !
దక్షిణాదిన రెండో రాజధాని ఉండాలన్న ప్రస్తావన చాలా రోజులుగా వస్తున్నదే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వాతంత్రోద్యమ కాలంలోనే ఈ మాట చెప్పారన్న ప్రచారం ఉంది. హైదరాబాద్ ను సెకెండ్ కేపిటల్ చేయాలంటూ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకం 11వ అధ్యాయంలో అంబేడ్కర్ రాశారు. ఈ పుస్తకం 1955లో ప్రచురితమైనప్పుడు జనం అంబేడ్కర్ వాదనతో ఏకీభవించారని.. అయినా అది కార్యరూపానికి నోచుకోలేదని చెబుతారు. తర్వాత ఆ అంశం మరుగున పడిపోయింది. ఇటీవలి కాలంలో మారిపోతున్న రాజకీయ ప్రాధాన్యలతో ఉత్తర దక్షిణ తారతమ్యాలను పోగొట్టేందుకు సెకెండ్ కేపిటల్ ఒకటి కావాలన్న అభిప్రాయం చాలా రోజులుగా ఉంది.
రాజకీయ వ్యూహాల పరంగానూ బీజేపీకి కలిసి వస్తుందా?
నిజంగానే బీజేపీ.. రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేస్తామంటే.. స్వాగతించేవారు ఎక్కువగా ఉంటారు. కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామంటే మాత్రం బీఆర్ఎస్ అంగీకరించే అవకాశం ఉండదు. ఎందుకంటే తెలంగాణకు ఆదాయ వనరు.. హైదరాబాదే. కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఢిల్లీలోలా పాలన కేంద్రం చేతుల్లో ఉంటుంది. అందుకే.. బీఆర్ఎస్ వ్యతిరేకించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇతర పార్టీలు కూడా.. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి.. రెండో రాజధానిని చేస్తామంటే అంగీకరించే అవకాశం ఉండదు. కానీ కేంద్రం అనుకుంటే మాత్రం.. దేశంలో కోసం చేయలేరా అన్న వాదనతో పని పూర్తి చేయడానికి అవకాశం ఉంది.