Woman Lost Vision Due To Smartphone Usage :  స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. అన్ని పనులూ స్మార్ట్ ఫోన్ నుంచి చేసుకునేలా టెక్నాలజీ  మారిపోయింది. కానీ ఇదే అనేక రకాల సమస్యలకూ కారణం అవుతోంది. తాజాగా గంటల గంటలు స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల కంటి చూపు కూడా తగ్గిపోతోందని తేలింది. హైదరాబాద్‌కు చెందిన మంజు అనే 30 ఏళ్ల మహిళ తన చూపు తగ్గిపోతోందని వైద్యుల దగ్గరకు వెళ్లింది. టెస్టులు చేసిన వైద్యులు అసలు సమస్య అంతా స్మార్ట్ ఫోన్ ను గంటల తరబడి చూడటం వల్లే వచ్చిందని గుర్తించారు.  





 హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో సీనియర్ న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ సుధీర్ కుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వివరాలు షేర్ చేసుకున్నారు. కొన్ని సార్లు క్షణాల పాటు ఆమె ఏమీ  చూడలేకపోతున్నారని.. గుర్తించారు. రాత్రి సమయంలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఆమె ఎదుర్కొన్నారన్నారు. ఆమె కళ్లను నిపుణులతో టెస్టులు చేయిస్తే.. ఎలాంటి లోపాలు గుర్తించలేదు. దీంతో నరాల సంబంధించిన టెస్టులు చేశారు. అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత ఆమె  స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ (SVS) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు  గుర్తించినట్లుగా వైద్యుడు సుధీర్ కుమార్ తెలిపారు. 


కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లు వంటి పరికరాలను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వస్తుందని దీన్ని  డిజిటల్ విజన్ సిండ్రోమ్ గా పేర్కొనవచ్చని సుధీర్ కుమర్ తన సోషల్ మీడియా ఖాతాలో రాశారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి...  స్మార్ట్ విజన్ సిండ్రోమ్‌కు చికిత్స ఉందా అన్నదానిపై డాక్టర్ సుధీర్ కుమార్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకూ తగ్గించుకోవాలని సూచించినట్లుగా చెప్పారు. వైద్యుడి సలహాను పూర్తిగా పాటించిన మహిళకు నెల తర్వాత టెస్టులు చేస్తే.. మళ్లీ నార్మల్ అయిందని డాక్టర్ ప్రకటించారు. 


అదే పనిగా స్మార్ట్ ఫోన్ లేదా డిజిటల్ డివైజెస్ చూడటం.. కళ్లకు ప్రమాదకరమని.. చూపును తగ్గిస్తుందని స్మార్ట్ విజన్ సిండ్రోమ్ కు కారణం అవుతుందని డాక్టర్ సుధీర్ చెబుతున్నారు. ప్రతి ఇరవైనిమిషాలకు ఓ సారి కనీసం ఇరవై సెకన్ల బ్రేక్ తీసుకోవాలని .. కనీసం ఇరవై అడుగుల దూరం నుంచి డివైజెస్ చూడాలని సలహా ఇస్తున్నారు. దీనికి 20-20-20 రూల్ అని సంబోధించారు.