టాలీవుడ్‌ హీరోయిన్ డింపుల్ హయతికి హైదరాబాద్ పోలీస్ విభాగంలో ట్రాఫిక్ డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డేకు మధ్య వైరం ఉన్న సంగతి తెలిసిందే. వారు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్‌లో ఉంటుండగా పార్కింగ్ విషయంలో విభేదాలు తలెత్తాయి. ఒకరిపై మరొకరు పీఎస్‌లలో కేసులు కూడా పెట్టుకున్నారు. 


తాజాగా డింపుల్ హయతి పుండు మీద కారం చల్లినట్లుగా ఓ ట్వీట్ చేశారు. కొంత సేపటికి డిలీట్ కూడా చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను హైలెట్ చేస్తూ.. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని ఓ ట్వీట్ చేశారు. ట్రాఫిక్ జామ్ సమయంలో కంట్రోల్ చేయాల్సిన ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడ ఉన్నారని ఆ ట్వీట్ లో ప్రశ్నించారు. తమకు ఇంధనం ఫ్రీగా రావడం లేదని అన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ ట్రాఫిక్ లో ఎలా వెళ్లాలని నిలదీశారు. అంతటితో ఆగకుండా ట్విటర్లో మంత్రి కేటీఆర్ కు తెలంగాణ సీఎంవోకు ట్వీట్ చేశారు. వెంటనే ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఆ తర్వాత డిలీట్ చేశారు.


‘‘ఇంటికి చేరుకోవాలంటే గంటకు పైగా టైం పడుతోంది. రోడ్లపై ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంటే ట్రాఫిక్ డీసీపీలు ఎటు పోయారు? ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఎలా? ఇళ్లలో నుంచి బయటకి రాగలమా? మాకు పెట్రోల్ ఏమైనా ఫ్రీగా వస్తుందా?’’ అని ట్వీట్ లో రాశారు. ఈ సందర్భంగా కేబుల్‌ బ్రిడ్జిపై నిలిచి ఉన్న వాహనాల ఫొటోను ట్వీట్ చేశారు.