Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు మొదలయ్యాయి. గత మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సైతం తగ్గడంతో ఎండల నుంచి ఉపశమనం లభించింది. శనివారం రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, టోలీచౌకి, ఫిల్మ్ నగర్, షేక్ పేట, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి ఏరియాలలో వర్షం దంచికొడుతోంది. మరో 2 గంటలపాటు మోస్తరు వర్షం పడుతుందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేశారు.






వర్షపు నీరు రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బండి పడుతున్నారు. పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కు అంతరాయం తలెత్తింది. ఒక్కసారి భారీ వర్షం కురవడంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఖైరతాబాద్, నాంపల్లి, మాసాబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, ప్రగతి నగర్, నిజాం పేట్, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లోనూ  మోస్తరు వర్షం పడుతోంది. మరో మూడు రోజులు ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడుతుండగా, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురువనున్నాయి.






నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని మరి కొన్ని భాగాలకు (నిజామాబాద్ వరకు) విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 1-2  రోజుల్లో  తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం, పరిసరాలలోని ఒడిశా -  పశ్చిమ బెంగాల్  తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా కొనసాగుతుంది.






ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ జిల్లాలతో పాటు యానాంలలో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.






Join Us on Telegram: https://t.me/abpdesamofficial