Heavy Rains in Hyderabad: హైదరాబాద్ జంట నగరాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి కాస్త మబ్బులు పట్టి ఉండగా... ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షం కురిసింది. పడింది కాసేపే అయినప్పటికీ.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వర్షపు నీరంతా రోడ్లపై చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్ జంక్షన్ లో నీళ్లు నిలిచిపోగా... వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నీటిని తోడేస్తున్నారు. కేవలం గంట వ్యవధిలోనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 4.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. జూబ్లీహిల్స్ లో 3.8 సెంటీ మీటర్లు, ఖైరతాబాద్ లో 3.5 సెంటీ మీటర్లు, మెహదీపట్నంలో 3 సెంటీ మీటర్ల వాన కురిసింది. గోషామహల్ లో 2.5 సెంటీ మీటర్ల వర్షం పడింది. అలాగే చార్మినార్, యూసుఫ్ గూడ, సరూర్ నగర్, మలక్ పేట్, సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో 1.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. హయచ్ నగర్, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్ పరిధిలో ఒక సెంటీ మీటర్ వర్షం కురిసింది.
మరో రెండురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
రాగల రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రోజు నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే శుక్రవారం రోజు నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లా భారీ వానలు పడనున్నట్లు చెప్పింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. అయితే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.