Rains in Hyderabad | వాతావరణశాఖ ముందుగా హెచ్చరించినట్లే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.  గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో పలు జిల్లాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. పంటలను వరద నీరు ముంచెత్తింది. వాగులు ,వంకలు ఉప్పొంగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా మద్నూర్, డింగ్లీ , రామారెడ్డి మండలాల్లో కుండపోత వర్షాలకు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ లకు భారీగా వరద పోటెత్తింది. రామారెడ్డి మండలంలోని లింగంపేట వద్ద పుల్కం వాగు, కాసుమత్త వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మద్నూర్ ,డోంగ్లీ మండాల్లో వర్షం దంచికొట్టడంతో నింబూర్ వాడి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. నింబూర్ నుండి నింబూర్ వాడి మద్య వాగులు రహదారులను ముంచెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల ప్రభావంతో పది ఇళ్లు కూలాయి. నిజామాబాద్ జిల్లాలో వందకు పైగా చెరువులు నిండలుగా మారాయి. నిజామాబాద్, కామారెడ్డి కలక్టరేట్ లో వరద సహాయం కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పోలీసులు పహారా కాస్తున్నారు. 

భద్రాద్రి, ములుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్

ఇదిలా ఉండే భద్రాద్రి, ములుగు,  మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాాతావరణశాఖ.భూపాలపల్లి జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. సంగారెడ్డి, మంచిర్యాల, ఖమ్మం, నిర్మల్, ఆదిాలాబాద్, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

కామారెడ్డి జిల్లా శెట్లూరు వాగుకు వరద పోటెత్తడంతో వాగులో చిక్కుకున్న ఐదుగురు గొర్రెల కాపురులలో ముగ్గురుని అతి కష్టంమీద రక్షించగలిగారు రెస్కూటీమ్. వాగు దాటే పరిస్దితి లేక 500కు పైగా గొర్రెలు వరద ప్రవాహం మధ్య చిక్కుకుపోయాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి శెట్లూరు వాగుకు వరద ఉదృతికొనసాగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

వాయివ్య బంగాళాఖాతంలో తాజా మరో అల్పపీడనం ఏర్పడంతో తెలంగాణపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రేపు వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో వర్షాల ప్రభావంతో పలు చోట్ల రోడ్లు కొట్టకుపోయాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్ మండలంలో వార్ధా నది ఉప్పొంగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలొో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాద్ జిల్లాలో వరదల ప్రభావంతో ప్రాణనష్టం సంభవించింది. గంగారం మండలంలోని ఏడుపాముల జలపాతంలో ఓ యువకుడు గల్లంతైయ్యాడు. ఖమ్మం మున్నేరు వరద ఉద్రుతి పెరుగుతోంది. మున్నేరు పరివాహక ప్రాంతాలల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. 

గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ములుగు జిల్లాలలో భారీ వర్షాల ప్రభావంతో జన జీవనం స్తంభించింది. అత్యవసర పరిస్దితిని విధించిన కలెక్టర్, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జంపన్న వాగు పొంగిపొర్లడంతో మేడారం పరిసర ప్రాంతాల్లో అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  అధికారులకు సెలవులు రద్దు చేయడంతోపాటు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగకుండా చూడాలంటూ మంత్రి ఆదేశించారు. మంగపేట, కమలాపూర్ లో పలు కాలనీలను వరద ముంచెత్తింది.పొదుమూరు కాలనీ జలదిగ్బందంలో చిక్కుకుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.