Hyderabad Property registration Value | హైదరాబాద్: తెలంగాణలో త్వరలోనే భూముల విలువ పెరగనుంది. భూముల ధర సవరించడంలో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి భూముల రిజిస్ట్రేషన్ ధర పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొదటగా కోర్ అర్బన్ రీజియన్‌లో భూముల విలువను సవరించే ప్రక్రియ దాదాపు మొదలైంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలుపుతారు. మొదటగా కోర్ అర్బన్ రీజియన్‌లో కొత్త విలువను అమల్లోకి తెస్తారని సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఒక సంవత్సరం విరామం తర్వాత, హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CUR) లో WP ఆస్తి రిజిస్ట్రేషన్ విలువల పునఃసమీక్షను ప్రారంభించింది. ఈ కొత్త రేట్లు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల అధికారిక రిజిస్ట్రేషన్ విలువ పెరగడంతో పాటు ప్రస్తుత మార్కెట్ ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాని తగ్గించడమే రేవంత్ సర్కార్ లక్ష్యం.
ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ రాష్ట్రంలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సుమారు 60 శాతం నుంచి 70 శాతం ఆదాయాన్ని అందిస్తోంది. 2021లో చివరిసారిగా రిజిస్ట్రేషన్ రేట్లు పెంచినప్పటికీ కోకాపేట్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రముఖ ప్రాంతాలలో ఉన్న ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వ్యత్యాసంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు, అమ్మేవారు తక్కవ ధరలు చూపిస్తున్నారు.
ప్రభుత్వానికి రూ.2500 కోట్ల వరకు ఆదాయం
భూముల ధరల పునఃసమీక్షలో తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి అదనంగా ₹2,000 కోట్ల నుంచి ₹2,500 కోట్ల వరకు ఆదాయం తెస్తుందని అంచనా వేశారు. ఈ పెంపు అవసరమని, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో అసలు రేట్లతో బిజినెస్ జరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గత మూడేళ్లుగా ఐటీ, ఫైనాన్షియల్ సేవలకు డిమాండ్ పెరిగిన కారణంగా ఇళ్ల ధరలు వేగంగా పెరిగాయి. ఈ పునఃసమీక్ష భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత తీసుకొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రతిపాదనకు ముందుగా డెవలపర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన స్టేక్‌హోల్డర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ విలువలు పెరగడం వలన రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గిపోతుందని ప్రభుత్వానికి తెలిపారు. కొనుగోలుదారులు అధిక ధరల వలన ఇళ్లు కొనరని కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగా భూముల ధర పెరుగుదల తాత్కాలిక ప్రభావం చూపుతుందని.. పెట్టుబడులు పెరిగి రియల్ ఎస్టేట్ కు మళ్లీ బూమ్ వస్తుందని అధికారులు దీమా వ్యక్తం చేశారు.
స్థానిక ఎన్నికల తరువాతే..
కొత్త రేట్లకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తైన వెంటనే పెరిగిన భూముల ధర అమలు చేస్తారని అంచనా. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పు లావాదేవీల సంఖ్యపై ప్రభావం చూపినా, దీర్ఘకాలంలో మార్కెట్ రేట్లు, ప్రభుత్వ రికార్డుల మధ్య వ్యత్యాసాని తగ్గిస్తుంది.
దేశంలో ముఖ్యమైన రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. నివాస, వాణిజ్య రంగాల్లో ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించడంతో పాటు మార్కెట్లో భూమి ధరలు, రిజిస్ట్రేషన్ భూమి ధరల్లో వ్యత్యాసం తగ్గించి పారదర్శకత తీసుకురావాలని భూముల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.