హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేటలో ఓ యువకుడి శవం అనుమానాస్పద రీతిలో కుళ్లిపోయిన స్థితిలో లభ్యం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతూ ఉంది. సోమవారం (మే 29) స్థానికుల ద్వారా ఈ శవాన్ని గుర్తించారు. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఓ వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం వల్ల, ఆ ఉపాధ్యాయురాలి భర్త నాగేశ్వరరావు రాజేశ్‌ను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ టీచర్ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. టీచర్ భర్తతో పాటు మరికొంతమంది బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
అయితే, రాజేశ్ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని టీచర్ భర్త నాగేశ్వరరావు వివరణ ఇచ్చాడు. తనకు అతనితో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కానీ, తన భార్యను ఎవరో బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టిన విషయం తెలుసని అన్నారు. తన భార్యకు రాజేశ్‌తో సోషల్ మీడియాలో పరిచయం జరిగి ఉండొచ్చని చెప్పాడు. వాళ్లిద్దరికీ వయసులోనూ చాలా తేడా ఉందని అన్నారు. తన భార్య ఆత్మహత్య విషయంపై కూడా పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు రాబట్టాలని నాగేశ్వరరావు కోరారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ లో ఉంటున్న ఓ గవర్నమెంట్ టీచర్‌తో రాజేశ్ అనే యువకుడికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి గుట్టు టీచర్ భర్తకు తెలియడంతో ఇవన్నీ మానుకోవాలని ఆమెను పలుమార్లు మందలించాడు. మనస్తాపానికి గురైన ఆమె, అవమాన భారంతో తాను చనిపోతానంటూ రాజేష్‌కు తెలిపింది. ఆ మేరకు వాట్సప్ లో వీరి మధ్య చాటింగ్ నడిచింది. నువ్వు చనిపోతే నేనూ చనిపోతానని రాజేశ్ కూడా చాటింగ్ లో చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ నెల 24న పురుగుల మందు తాగి టీచర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది.
మరోవైపు, ఈ నెల 24 నుంచి రాజేశ్ ఆ టీచర్ ఇంటి చుట్టూ తిరుగుతుండగా.. ఆమె కొడుకు గమనించాడు. తన స్నేహితులతో కలిసి ఈ నెల 26న రాజేశ్‌ను పట్టుకొని నిలదీసి.. అతడి సెల్‌ఫోన్ పరిశీలించగా అసలు విషయం తెలిసింది. దీంతో వారు రాజేశ్‌ను కొట్టి హెచ్చరించి వదిలేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిజానిజాలు తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.