Haritha Haram Program: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంతా తమ తమ నియోజకవర్గాల్లో ఘనంగా హరితోత్సవం కార్యక్రమాన్ని జరుపుతున్నారు. మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగానే స్పందిస్తూ.. దశాబ్దాలపాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం.. మహోద్యమంలో సాగుతున్న తెలంగాణ హరితహారం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకు చిత్రాన్ని మార్చడమే కాదని ధ్వంసమైన అడవులను పునరుద్ధరించడం, సకల జీవరాశులను సంరక్షించుకోవడం అని యావత్ దేశానికి సగర్వంగా చాటి చెప్పిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెల్లడించారు. ఈ గ్రీన్ వాల్ ఆఫ్ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములైన ప్రకృతి ప్రేమికులందరికీ హృదయపూర్వక దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తోంది..!
అన్ని రకాల మౌలిక వసతులతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇలా ప్రపంచంలో అన్ని వసతులతో అభివృద్ధి చెందే అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.7 శాతం వృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ప్రవేశ పెట్టిన హరితహారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. సీఎం కేసీఆర్ వంటి నిజమైన పర్యావరణ వేత్త సమగ్ర, స్థిరమైన అభివృద్ధి గురించి ఆలోచిస్తామని వెల్లడించాడు. ప్రతి ప్రభుత్వం ఏం చేయాలో ప్రపంచానికి తెలంగాణ సగర్వంగా చాటి చెప్పిందని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తుందని, దేశం అనుసరిస్తుందని ట్వీట్ చేశారు. హరితహారంలో బాగంగా రాష్ట్రంలో 14,864 నర్సరీలను, 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 13.44 లక్షల ఎకరాల్లో అడవులను పునరుద్ధరించామని ఇప్పటి వరకు 273 కోట్ల మొక్కలను నాటామన్నారు.
ఆస్తులు కాదు ఇవ్వాల్సింది, మంచి వాతావరణమే..!
భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు... మంచి వాతావరణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మారేడ్ పల్లిలోని పార్కులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. పద్మారావు నగర్ లోని చిదానందం కాలనీలో దశాబ్ది పార్కును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఒక్కరోజే నగరంలో 60 దశాబ్ది పార్కులను ప్రారంభించుకున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యవేక్షణ, కృషితో చేపట్టిని హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో పార్కుల నిర్మాణం, రహదారుల వెంట మొక్కల పెంపకం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పరిరక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
స్వచ్ఛమైన గాలి, నివాసయోగ్యమైన ప్రకృతే ప్రధానం
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో హరితోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, జిల్లా జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్, అదనపు కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మాంగల్య ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమై గాలిని, నివాస యోగ్యమైన ప్రకృతి పరిసరాలను అందిచాలనే గొప్ప సంకల్పమే హరిత హారానికి పునాదని చెప్పారు. ఇలా ఆలోచించడంతో పాటు ఆ దిశగా ప్రజలను ఒక సామాజిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాగస్వామ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.