Telangana Assembly Sessions | హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘కాంగ్రెస్ బడ్జెట్లు అవాస్తవిక అంచనాలు అని గతంలోనే చెప్పాను. కానీ వారు కాదు పొమ్మన్నరు. గత ఏడాది బడ్జెట్ 2 లక్షల 91 వేల 159 కోట్లు అని గొప్పగా చెప్పుకున్నారు. రివైజ్డ్ ఎస్టిమేషన్ లో 27 వేల కోట్లు తక్కువ చేసి చూపించారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే 60 వేల నుంచి 70 వేల కోట్లు తక్కువగా వస్తాయని చెప్పారు. అంటే అంచనా అవాస్తవం అని తేలిపోయింది.
FIRST, THEY PROMISE REFORMS, THEN THEY REFORMED THEIR PROMISES
పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పారో గానీ కాంగ్రెస్ కోసమే చెప్పారు. ఎన్నికలకు ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు. ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలనే ఏమార్చేసారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసింది లేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేం ఇచ్చిన 5లక్షలకు మించి పెంచలేదు. 5లక్షల వరకే వడ్డీ అందుతుందని ప్రభుత్వమే శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పష్టంగా చెప్పింది. మళ్లీ మీరే తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం అని ప్రచారం చేస్తున్నారు’ అని హరీష్ రావు ప్రశ్నించారు.
మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి VLR వర్తిస్తుంది అనే ఉత్తర్వులు ఎక్కడైనా ఉంటే చూపాలని భట్టి విక్రమార్క గారిని కోరుతున్నాను. లేదా ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు, మహిళల్ని మోసం చేసిందనందుకు క్షమాపణలు చెప్పాలని మా డిమాండ్. ఈ ఏడాది కాలంలో కూల్చిన ఇండ్లే తప్పా.. రాష్ట్రంలో కట్టిన ఇల్లు ఒక్కటన్నా ఉందా? మీ మధిరల ఒక్క ఇల్లన్న కట్టిన్రా, చూపిస్తరా భట్టిగారు. కాంగ్రెస్ చెప్పినట్లు నాలుగున్నర లక్షలు కాదు కదా, ఈ 16నెలల కాంగ్రెస్ పాలనలో 4 ఇండ్లన్న కట్టలేదు. మీరుండడం వల్ల రూపాయి ఎక్కువ వస్తదని ఆశ పడ్డరు. కానీ మీరు ఉన్నది తీసేసారు. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా లక్ష రూపాయలు ఇస్తామన్నది ఏత్తేసారు. దళితులను, గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది.
జాబ్ లెస్ క్యాలెండర్.. అంతా అంకెల గారడీ
జాబ్ క్యాలెండర్ కాస్తా, జాబ్ లెస్ క్యాలెండర్ అయ్యింది. జాబులేవి అని అడిగితే నిరుద్యోగుల వీపులు పగలగొట్టారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. యువతకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. తుది దశలో ఉన్న ఆరు ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరం పూర్తిచేస్తమని గత బడ్జెట్ లో అన్నరు. ఒకవేళ పూర్తయితే 6 ప్రాజెక్టుల పేర్లు చెప్పండి. లేదా సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ అనేది రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రం. కానీ రాష్ట్ర ప్రభుత్వానిది అంకెల గారడీ తప్ప, అమలు ఉండదా. ఇంత దారుణమా? మీ ప్రసంగాలు, మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటరు అనే కనీస ఆలోచన కూడా లేదా? అంకెలు చూస్తే ఆర్భాటం... పనులు చూస్తే డొల్లతనంలా ఉందని హరీష్ రావు ఎద్దేవా చేశారు.