Online betting app advertisements in Hyderabad Metro Rail: హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ గేమ్ లపై పోలీసులు ఫోకస్ చేశారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచనలతో ఏపీ, తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారణకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం అప్రమత్తమైంది. మెట్రో రైలు లోపల, మెట్రో రైలు కోచ్ లపై ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రకటనలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ మెట్రో రైలు కోచ్‌లు, రైలు లోపల ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ లపై ప్రకటనలు ఉన్నాయని ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవయ్యాయి. దీనిపై ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అప్రమత్తమైంది. మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు, బెట్టింగ్ గేమ్ ప్రకటనలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీస్ రెడ్డి తెలిపారు. తక్షణమే మెట్రో స్టేషన్లలో, మెట్రో రైలు కోచ్‌లపై, రైలు లోపల ఉన్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రకటనలు తొలగించాలని యాడ్ ఏజెన్సీలను, ఎల్ అండ్ టీ సిబ్బందిని ఆదేశించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

 

తెలంగాణలో 800 కేసులు నమోదు: షికా గోయల్‌సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్ పై స్పందించారు. తెలంగాణలో బెటింగ్ యాప్స్‌పై 2017 నుంచి బ్యాన్ ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్ ఆడడం ఇల్లీగల్ అని, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు ఉంటాయన్నారు. తాము ఆన్‌లైన్‌ నుంచి ఇప్పటివరకు 108 బెట్టింగ్ యాప్స్  తొలగించినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై 800 వరకు కేసులు నమోదయ్యాయని షికా గోయాల్ వెల్లడించారు.