ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీ కూడా కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. శుభాంకాంక్షలు తెలిపిన వారిలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, ఈయన అందరిలా మాత్రం విషెస్ చెప్పలేదు. రోజూ ఏదో వివిధ అంశాలపై సీఎంను విమర్శిస్తూ ఉండే ఆయన.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంలోనూ అదే పంథా అనుసరించారు. సెటైరికల్‌గా, పరోక్షంగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఓ ఊసరవెల్లి ఫోటోను జత చేసి, జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో చాలా సార్లు ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి ఊసరవెల్లితో పోల్చిన సంగతి తెలిసిందే. ఊసరవెల్లిలా కేసీఆర్ కూడా రంగులు మార్చుతారని, చెప్పిన హామీలు, ఇచ్చిన మాటలు ఎప్పుడూ నిలబెట్టుకోరని చాలా సార్లు రేవంత్ రెడ్డి విమర్శించారు.
రేవంత్ అరెస్టు
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేయాలన్న డిమాండ్‌తో పోలీస్ కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల ముట్టడికి నేడు కూడా తెలంగాణ పీసీసీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కూడా నిరసనలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న (ఫిబ్రవరి 17) పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలను హౌజ్ అరెస్టు చేశారు. ఆయన నివాసం ముందు బారికేడ్లు పెట్టి.. పోలీసులు భారీగా మోహరించారు. ఈ రోజు కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద రేవంత్ ధర్నా చేయనున్నట్లు సమాచారం రావడంతో అయన ఇంటివద్దే ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నేడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను నిరసనలు చేయకుండా పోలీసులు ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్‌లు, అదుపులోకి తీసుకోవడం వంటివి చేస్తున్నారు.