తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వ్యవహారం పొలిటికల్ కాక రేపుతోంది. కొందరు అభ్యర్థుల ఆందోళనతో మొదలైన వివాదాన్ని ఇప్పుడు రాజకీయా పార్టీలు అందుకున్నాయి. ఓ నెల రోజుల పాటు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ప్రశ్నిస్తున్నాయి. 


గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్‌తో బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఆయన హైదరాబాద్‌లో గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్నపోలీసులు ఆయన ఇంటిని అర్థరాత్రి ముట్టడించారు. ప్రవీణ్ కుమార్ బయటకు రానీయకుండా కార్యకర్తలు అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. 


దీక్షకు అందరూ కదిలి రావాలని ఆయన శుక్రవారమే ట్విటర్‌లో మెసేజ్ చేశారు. " TSPSC ఆధ్వర్యంలో ఆగస్టు 29,30 నాడు జరగబోయే గ్రూప్ 2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని నేను, ప్రొ కోదండరాం ఇతర మేధావులు, సామాజిక ఉద్యమకారులం అందరం తెలంగాణ అమర వీరుల స్థూపం, గన్ పార్క్ వద్ద శాంతియుతంగా సత్యాగ్రహం చేయబోతున్నం. ఇది ఎవరి మీదనో కోపంతోనో, పంతం నెగ్గించుకోవాలనో చేస్తున్న దీక్ష కాదు. కేవలం తెలంగాణలో 5.75 లక్షల అభ్యర్థుల గుండె చప్పుడును పాలకులకు చేరవేసి తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగేలా చూసే ప్రయత్నమే. అనవసరంగా ఆంక్షలు పెట్టకండి." అని రాసుకొచ్చారు. 


అటు కోదండ రామ్‌ని కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయనతోపాటు మిగతా నేతలను రాత్రి నుంచి ఇల్లు కదలనీయకుండా చేశారు. 


ఉదయం నుంచి ఆయన్ని హౌస్ అరెస్టు చేయడంతో ప్రవీణ్ కుమార్ తన ఇంట్లోనే దీక్ష చేపట్టారు. సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది. గ్రూప్ 2 వాయిదా వేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. 






కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనలకు సిద్ధమైంది దీంతో లీడర్లను ముందుగానే హౌస్ అరెస్టులు చేశారు. ఎక్కడి వాళ్లను అక్కడే నిర్బంధించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. తుపాకులతో తమను కాల్చి చంపేయాలని రిక్వస్ట్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయడం లేదని వారి తరఫున పోరాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు. 


9 ఏళ్ల పాటు నిద్రపోయిన సర్కారు ఇప్పుడు ఎన్నికల టైంలో నోటిఫికేషన్లు ఇచ్చారని కాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. వాటిని కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారని విమర్సించారు. పేపర్ లీక్‌లతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. వారికి ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు. 


ఇలా నిరుద్యోగుల భరోసా ఇవ్వడానికి అండగా ఉంటే హౌస్ అరెస్టులు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. 9 ఏళ్ల పాటు నిద్రపోయిన కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనీ వార్నింగ్ ఇచ్చారు. ఇలా హడావిడిగా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. 


ఇలాంటి పెద్ద ఇష్యూను పక్కదారి పట్టించడానికే బిజెపి నాయకులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ధర్నాలు చేయిస్తున్నారని ఆపరోపిస్తోంది కాంగ్రెస్. ఇదంతా చీకటి ఒప్పందంలో భాగంగా ప్లాన్ ప్రకారం నడుస్తోందన్నారు. 3వేల నిరుద్యోగ భృతినీ విద్యార్థుల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు.