Tspsc Board Recruitment : టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల నియామకంపై తెలంగాణ ( Telangana) ప్రభుత్వం (Government) కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఛైర్మన్ (Chairman)తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని ముఖ్యమంత్రి (Cm)రేవంత్ రెడ్డి (Revanth Reddy)భావిస్తున్నారు. బోర్డు నియామకంపై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం... కొందరు బ్యూరోక్రాట్ల పేర్లతో పాటు ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బోర్డును వీలయినంత త్వరగా నియామించాలని భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నియమించిన బోర్డు ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటుపై దృష్టి సారించింది. నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా, ఉద్యోగాలు భర్తీ చేయాలన్నా...పరీక్షలు నిర్వహించాలంటే బోర్డే కీలకం. అందుకే తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ బోర్డు నియామకంపై సీనియస్ గా కసరత్తు చేస్తోంది. గతంలో మాదిరిగా పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
గత ప్రభుత్వ హయాంలో లీకులే లీకులు
గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, పరీక్షల నిర్వహణలో బోర్డు విమర్శల పాలయింది. పరీక్షపేపర్ లీకులో బోర్డులో పని చేసే ఉద్యోగులే ఉండటం రాజకీయ దుమారం రేపింది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం బోర్డులో ఛైర్మన్, 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఛైర్మన్ పదవితో పాటు 8 మంది సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే ఛైర్మన్‌తో పాటు తొమ్మిది మంది సభ్యుల్ని ప్రభుత్వం నియమించాల్సి ఉంది. బోర్డులో కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన, తెలంగాణ ఐఏఎస్ ను ఈ పోస్టులో నియమించాల్సి ఉంటుంది. గతంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి సంతోష్...జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.
ప్రక్షాళన చేయాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి
కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాత పోటీ పరీక్షలు నిర్వహించాలని సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ అనుసరిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెరుగైన విధానాలను కమిటీ అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ల పనితీరును పరిశీలించనుంది. తర్వాత అధ్యయన నివేదిక సభ్యులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. కమిషన్‌లో పలు మార్పులు జరిగే అవకాశంద ఉంది. యూపీఎస్సీ ఛైర్మన్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించేందుకు సలహాలను కోరారు. కొత్త బోర్డు నియమించిన వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. గ్రూప్-2 పరీక్షలతో ఇప్పటి వరకు పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూలు ప్రకటించనుంది.
Also Read:ప్రజాపాలన పేరుతో మెసేజ్, కాల్ వచ్చిందా!
Also Read: ఆ 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ - షెడ్యూల్ ఇదే