CEC Issued Notification for Mlc Election in Telangana: తెలంగాణ శాసనమండలిలోని (Telangana Legislative Council) 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక నిమిత్తం కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు సీట్లకూ విడివిడిగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వేర్వేరుగానే అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఈ నెల 18 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
2 స్థానాలు ఇవే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటి పదవీ కాలం 2027, నవంబర్ 30 వరకూ ఉంది. కాగా, ప్రస్తుతం శాసనసభ్యుల బలాబలాలను చూస్తే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మెజార్టీ ఉంది. 2 స్థానాలకూ విడివిడిగా ఎన్నికలు జరగనుండడంతో ఆ స్థానాలు హస్తం పార్టీయే కైవసం చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఆశావహులు ఎక్కువే
మరోవైపు, ఈ 2 ఎమ్మెల్సీల కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి పార్టీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ కుమార్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, హర్కల వేణుగోపాల్రావు, అద్దంకి దయాకర్, మైనార్టీ కోటాలో మస్కతీ డైరీ యజమాని అలీ మస్కతి, విద్యా సంస్థల అధినేత జాఫర్ జావిద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అటు, ఓడిపోయిన నేతలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ లు ఉన్నారు. మరి ఎవరికి ఈ పదవులు ఇస్తారనేది ఉత్కంఠగా మారింది.
Also Read: Chicken Peice: స్నేహితునితో పార్టీలో విషాదం - గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి