క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan), శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer )లకు... అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో నేటి నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ప్రకటించిన టీమిండియా(Team India) జట్టులో చోటు దక్కలేదని ఊహాగానాలు చెలరేగాయి. బీసీసీఐ(BCCI) వీరిద్దరిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే చర్యలు తీసుకుందని కూడా చాలా వార్తలు వచ్చాయి. దీనిపై టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Drevid) స్పష్టతనిచ్చాడు.

 

అలాంటిదేమీ లేదన్న ద్రావిడ్‌ 

ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లపై క్రమశిక్షణ చర్యలేం తీసుకోలేదని రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. సెలక్షన్‌కు ఇషాన్‌ కిషనే దూరంగా ఉన్నాడని... దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో విరామం కావాలని కోరడంతో ఒప్పుకున్నామని ద్రవిడ్‌ వెల్లడించాడు. ఇషాన్‌ కిషన్‌ తిరిగి జట్టులోకి రావాలనుకుంటే దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలని సూచించాడు. జట్టులో పోటీ కారణంగానే శ్రేయస్‌ను అఫ్గాన్‌తో టీ 20 సిరీస్‌కు ఎంపిక చేయలేదని... దక్షిణాఫ్రికాతో టీ20ల్లోనూ అతనాడలేదని ద్రవిడ్‌ గుర్తు చేశాడు. అయ్యర్‌ ఉత్తమ బ్యాటరే కానీ 11 మంది జట్టులో అందరినీ ఆడించలేం కదా అని ద్రవిడ్‌ అన్నాడు. జట్టు ప్రయోజనాలను అనుసరించే కూర్పుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ద్రవిడ్‌ తెలిపాడు. ఇప్పటికైతే రోహిత్‌, యశస్వి ఓపెనర్లుగా ఆడతారని... జట్టు అవసరాలను బట్టి మార్పులు చేసుకునే సౌలభ్యం తమకుందని టీమిండియా హెడ్‌ కోచ్‌ వెల్లడించాడు. ఓపెనర్‌గా జైస్వాల్‌ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నామని.... అంతే కాకుండా ఓపెనింగ్‌లో కుడి, ఎడమ చేతి వాటం కూర్పు కూడా ఉంటుందన్నాడు. కోహ్లి, రోహిత్‌ ఓపెనర్లుగా వచ్చే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమని ద్రవిడ్‌ వెల్లడించాడు. రోహిత్‌, కోహ్లి లాంటి ఆటగాళ్ల సామర్థ్యాలపై సందేహమే లేదని తేల్చి చెప్పాడు. 

 

లెఫ్ట్‌ హ్యాండర్లతో మంచిదే

రింకు సింగ్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ లాంటి లెఫ్ట్‌ హ్యాండర్లు జట్టులో ఉండడం మంచిదే అని ద్రవిడ్‌ అన్నాడు. కానీ ప్రదర్శన ఆధారంగానే జట్టు ఎంపిక ఉంటుందని స్పష్టం చేశాడు. ఫినిషర్‌ పాత్రలో రింకు రాణిస్తున్నాడని... మరింతగా రాణించేందుకు అతడికి అఫ్గాన్‌ సిరీస్‌ ఓ అవకాశమని ద్రవిడ్‌ తెలిపాడు. ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టీ20 మ్యాచ్‌ల నుంచి బుమ్రా, జడేజా, సిరాజ్‌ను దూరం పెట్టాల్సి వచ్చిందన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అఫ్గాన్‌తో తొలి టీ20లో కోహ్లి ఆడట్లేదని... రెండు, మూడు టీ20ల్లో అతను బరిలో దిగుతాడని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. 

 

నేడే తొలి టీ 20

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు మొహాలీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో తొలిమ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కంటే ముందు భారత్‌ ఆడనున్న చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 14 నెలల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి వచ్చిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీపై అందరి దృష్టి నెలకొంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌, అఫ్గానిస్తాన్‌ నేడు మొహాలీ వేదికగా తొలిమ్యాచ్‌లో తలపడనున్నాయి. 14 నెలల విరామం తర్వాత సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌కోహ్లీ తిరిగి టీ20 జట్టులోకి రావడంతో అందరి దృష్టివారిపైనే నెలకొంది.