MLA Raja Singh: బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా రెడీ అని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. సాధారణ ఎన్నికల్లోనూ తెలంగాణలో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. పార్టీ ఎవరిని నియమించినా 8 మంది ఎమ్మెల్యేలం కలిసిమెలిసి పని చేస్తామని చెప్పారు. మంచి వ్యక్తికే పార్టీ ఆ బాధ్యతలు అప్పగిస్తుందని అనుకుంటున్నట్లుగా రాజాసింగ్ చెప్పారు. 


గత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి వెళ్లారన్నారని, ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో ప్రస్తుత సీఎం స్పష్టం చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. నిధులు ఇటలీ నుంచి తెస్తారా? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ యుద్ధం మొదలవుతుందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకటేనని విమర్శించారు.


ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నంత కాలం ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయని బీజేపీ ఎమ్మెల్యేలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. అక్బరుద్దీన్‌ ముందు ప్రమాణం చేసేది లేదన్న మాటకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అందుకే స్పీకర్‌ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ కుమార్ ముందు ప్రమాణం చేశామని అన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.


ఇటీవల ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో దాదాపు అందరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం సభ నుంచి వెళ్లిపోయారు. ఇక సీనియర్లను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడానికి అక్బరుద్దీన్‌కు అవకాశం ఇవ్వడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయకుండానే వెళ్లిపోయారు. హిందువులను చంపేస్తానని గతంలో అన్న వ్యక్తి నాయకత్వంలో తాము ప్రమాణం చేయబోమని రాజాసింగ్ తేల్చి చెప్పారు. పూర్తిస్థాయి స్పీకర్ నియామకం తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు. ఆ ప్రకారం.. గడ్డం ప్రసాద్‌ కుమార్ ను పూర్తి స్పీకర్‌గా నియమించిన తర్వాతే బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా, బీజేపీ అధిష్ఠానం శాసనసభాపక్ష నేతను నియమించకుండానే వారు సమావేశాలకు హాజరయ్యారు.