Godavari Express Derails: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ డెక్కన్ మధ్య నడిచే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బీబీ నగర్ సమీపంలో పట్టాలు తప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీ వల్లే పెను ప్రమాదం తప్పిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. దాని వల్లే వేల మంది ప్రాణాలు నిలిచాయని, ఎలాంటి గాయాలు కాకుండా అంతా క్షేమంగా బయట పడగలిగారు. గోదావరి ఎక్స్ ప్రెస్ భోగీలన్నీ జర్మనీకి చెందిన ఎల్‌హెచ్‌బీ(లింకే-హాఫ్ మన్-బుష్) బోగీలు. ఒక ఎల్‌హెచ్‌బీ కోచ్ కాలపరిమితి 35 సంవత్సరాలు. కరంబూర్ చెన్నై రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి ఉత్పత్తి అవుతాయి. ఈ టెక్నాలజీ వల్లే రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు. స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియం స్టీల్ తో కోచ్ లు తయారు అవుతాయి. 2020 నుంచి ఈ టెక్నాలజీ కోచ్ లను తయారు చేయిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.
ఎల్‌హెచ్‌బీ కోచ్ వల్లే ప్రమాద తీవ్రత తగ్గింది..!
ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీ వల్లే అతిపెద్ద ప్రమాదం నుంచి గోదావరి రైలును బయట పడేసింది. ఎలాంటి ప్రమాదం జరిగినా ఈ ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీ వల్ల ఏ కోచ్‌కు ఆ కోచ్ విడిపోతాయి. ఒక బోగీతో మరో బోగీ ఢీ కొట్టడం కానీ.. ఇతర ప్రమాదకర పరిస్థితులు ఉండబోవు. ఈ టెక్నాలజీతో తయారు చేసిన బోగీలు ఎత్తు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ప్రమాదం జరిగిన వెంటనే బోగీలు పక్కకు ఒరిగపోవడం జరగదు. ఎల్‌హెచ్‌బీ కోచ్ వల్లే ప్రమాద తీవ్రత తగ్గిందని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.
రైలు ఎంత స్పీడులో ఉన్నా.. ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం వల్ల కంట్రోల్ అవుతుంది. ఎయిర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ద్వారా బోగీలు ఢీ కొనడం లాంటివి, స్లయిడ్ అవ్వకుండా ఆపగల్గుతుంది. ఘటనా స్థలానికి నేరుగా తానే వెళ్లిన అరుణ్ కుమార్ పరిస్థితులు పరిశీలించి మీడియాతో మాట్లాడారు. 16కుపైగా బోగీలతో విశాఖ నుంచి హైదరాబాద్ కు వస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ ఆరో బోగీ పట్టాలు తప్పినట్లు గుర్తించామన్నారు. రైల్లో ఉన్న వారిని ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు.
ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్..
ప్రయాణికుల కోసం 040 27786666 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందని, రాత్రి వరకు ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. దెబ్బ తిన్న పట్టాలు, సిమెంట్ దిమ్మెల తొలగింపు కొనసాగుతోందని.. సుమారు 400 మంది రైల్వే సిబ్బంది మరమత్తు చర్యల్లో పాల్గొన్నారనిన జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.