Fire Accidents In GHMC: హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదం జరిగితే మంటలు అదుపు చేయడం ఒక ఎత్తైతే ,మంటల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడటం పెను సవాలుగా మారింది. ఇటీవల ఒకేరోజు సికింద్రాబాద్, జీడిమెట్ల ఇండస్ట్రీయల్ ఏరియాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు భారీ స్థాయిలో ఆస్తి నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం అంటే నగరవాసులు హడలిపోతున్నారు. భారీగా మంటలు ఎగసిపడటంతో పాటు వ్యాపార సముదాయాల్లో మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడటం పెనుసవాలుగా మారుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే జీహెచ్ ఎంసీపై నగరవాసుల నుండి తీవ్ర స్దాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. 


ముఖ్యంగా వాణిజ్య , వ్యాపార సముదాల్లో ఫైర్ సేఫ్టీ విషయంలో జీహెచ్ఎంసీ మొద్దు నిద్రపోతుందా అంటూ మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టుంది GHMC. నగరంలో ఇకపై చిన్న వ్యాపారస్తులు సైతం తప్పనిసరిగా ఫైర్ మిటిగేషన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోవాలనే నిబంధనలు కఠినతరం చేసింది. అగ్ని ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ఫైర్ సేప్టీ సర్టిఫికేట్స్ పొందే మార్గం అందరికీ అందుబాటులో ఉండటంతోపాటు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. 


నగరంలో అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా ముందుగా చిన్న చిన్న వ్యాపారస్తులు సుమారు 100 చదరపు మీటర్ల విస్తీర్ణం గల భవనాలు తప్పనిసరిగా ఫైర్ మిటిగేషన్/ సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించడంతోపాటు వేగవంతం చేసింది.
 
 చిన్న, చిన్న షాపులు, వ్యాపారం చేసుకునే ఇంటి యజమానులు గానీ అద్దెకు తీసుకొని 100 చదరపు మీటర్ల కంటే తక్కువ గాని అంతకంటే ఎక్కువ ప్లింత్ ఏరియాలో  వ్యాపారం చేసుకునే వారు అగ్ని ప్రమాదాల నివారణకు ఎవరికీ వారే స్వయంగా ఫైర్ మిటిగేషన్/ సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకునేందుకు  ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఫైర్  మిటిగేషన్/ సేఫ్టీ సర్టిఫికేట్ ను పొందే అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసుకుంటే ఈ సర్టిఫికెట్ ను ఆన్ లైన్ ద్వారా జారీ చేసే వెసులుబాటు కల్పించింది. నగరంలో ప్రతి వ్యాపారస్తుడు ఫైర్ సేప్టీ సర్టిఫికేట్ పొందేందుకు ముందుకు రావాలని జీహెచ్ఎంసీ సూచించింది.


వ్యాపారస్తులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే విధానం ఇలా:


1. ముందుగా www.ghmc.gov.in వెబ్ సైట్ ను క్లిక్ చేసి fire mitigation/safety certificate సెలెక్ట్ చేయాలి లేదా ఈ లింక్ https://firesafety.ghmc.gov.in/Login/Citizen_login కావాలి.


2.  ఆ వెబ్ సైట్/ లింక్  లాగిన్ అయిన తర్వాత తమ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వచ్చిన ఓటిపీ వస్తుంది. ఆ ఓటీసీ తప్పని సరిగా ఎంటర్ చేయాలి. 


3. మంటలు ఆర్పే పరికరాల ఏజెన్సీ జాబితా నుంచి తమకు నచ్చిన ఎంపానెల్ ఏజెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి.


4. అప్లికేషన్ చేసే వ్యక్తి ఇంటి టాక్స్ ఇండెక్స్ నంబర్(TIN) కలిగి ఉన్నట్లయితే టిన్ (TIN) నెంబర్ తో పాటుగా ఎంపానెల్ ఏజెన్సీ నీ ఎంపికను కన్ఫామ్ చేసుకోవాలి.


5.  ఒకవేళ టిన్(TIN) నంబర్ లేని పక్షంలో  షాప్ ఎస్టాబ్లిష్మెంట్, అడ్రస్, సర్కిల్ లేదా జోన్ ను ఎంపిక చేసుకున్న తర్వాత ఎంపానెల్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ చేసుకోవాలి. 


6. ఎంపానెల్డ్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏజేన్సీ తమ షాపు వద్దకు వచ్చి అగ్ని ఆర్పే పరికరాన్ని ఫిట్టింగ్ చేసిన తర్వాత ఆ ఏజేన్సీ ఫిట్టింగ్ చేసినట్టు వెబ్ సైట్ లో నమోదు చేస్తారు. తదుపరి ఫైర్ మిటిగేషన్/ సేఫ్టీ సర్టిఫికెట్ ఆన్లైన్ లో జనరేట్ అవుతుంది. ఆ తర్వాత తమ అప్లికేషన్ స్టేటస్ రిపోర్ట్ లో చూసుకోవచ్చు.


7. జనరేట్ అయిన సేఫ్టీ సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేసుకొని షాప్ లో డిస్ ప్లే చేసుకోవాలి.