హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్ల నిర్మాణం.. ఇలా వేర్వేరుగా ప్రణాళికలతో ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రూ. 2140 కోట్లతో హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లింకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నది. ట్రాఫిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తొలివిడతలో 275.53 కోట్ల రూపాయల ఖర్చు చేసి, 22 చోట్ల 24.30 కిలోమీటర్ల మేర లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.


అత్యధికంగా వెస్ట్‌జోన్‌లో, ఆ తర్వాత కోర్‌ సిటీలో విడతలవారీగా లింకు రోడ్లు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే మాసబ్‌ట్యాంక్‌, NMDC చౌరస్తాలో ట్రాఫిక్‌ కు శాశ్వత విముక్తి కల్పించేలా లింకు రోడ్డు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది. ఈ మేరకు బల్దియా స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఈ లింకు రోడ్డు విస్తరణను నేడు (మంగళవారం) ఆమోదిస్తారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే నుంచి సరోజినీదేవి కంటి దవాఖాన మెయిన్ గేట్ దాటి కొద్ది దూరం వెళ్లగానే ఎడమ వైపు ఉన్న రోడ్డును, అహ్మద్‌నగర్‌ ఫస్ట్‌ లాన్సర్‌ రోడ్‌ మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నం 12 ఖాజా మేన్షన్‌ ఫంక్షన్‌ హాల్ వరకు అనుసంధానం చేస్తారు.


ఈ కొత్తలింకురోడ్డు 18 మీటర్ల వెడల్పుతో విస్తరిస్తారు. ఈ మార్గంలో 178 ఆస్తులను గుర్తించారు. ఈ లింకు రోడ్డు అందుబాటులోకి వస్తే మెహిదీపట్నం, ఎయిర్‌పోర్టు నుంచి పీవీఎఎక్స్‌ప్రెస్‌ హైవే వైపు నుంచి వచ్చేవారికి బంజారాహిల్స్‌ వైపు వెళ్లడం ఈజీ అవుతుంది. దీని వల్ల సరోజినీదేవి కంటి దవాఖాననుంచి ఎన్‌ఎండీసీ చౌరస్తా, మాసబ్‌ట్యాంక్‌ చౌరస్తా ట్రాఫిక్‌ గణనీయంగా తగ్గుతుంది.


ప్రారంభానికి సిద్ధంగా ఎల్బీ నగర్ కుడివైపు ఫ్లయ్ ఓవర్ 


మరోవైపు నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఎస్‌ఆర్‌డీపీ ద్వారా చేపట్టిన వివిధ పనులు పూర్తి కావొస్తున్నవి. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కుడివైపు గల మరో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ వంతెనని ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ త్వరలోనే ప్రారంభిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్  కారణంగా ఇన్ని రోజులు ఆలస్యమైంది. మార్చి చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి ఆ వంతెనను తీసుకురాబోతున్నట్టు జీహెచ్‌ఎంసీ తెలిపింది.


ఈ ఫ్లై ఓవర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలతోపాటు నగర వాసులకు హయత్ నగర్  మీదుగా ఇతర  ప్రాంతాల వెళ్లేందుకు ఎంతగానో దోహద పడుతుంది. 700 మీటర్ల పొడవు  12 మీటర్ల వెడల్పు గల  ఈ ఫ్లై ఓవర్ మీద వాహన వేగం కూడా పెరగనున్నది. ఎల్ బి నగర్ జంక్షన్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా వెళ్లేందుకు కుడివైపు  ఎంతగానో ఉపయోగపడుతుంది.


SRDP ద్వారా చేపట్టిన 47 పనులలో ఇప్పటివరకు 35 పనులు  పూర్తికాగా, వాటిలో ఎల్బీనగర్ RHSఫ్లైఓవర్ 19వది. మరో మూడు పనులు ముగింపు దశల్లో వున్నాయి. రూ. 2335.42 కోట్ల వ్యవయంతో చేపట్టిన 10 రకాల పనులలో  ఫ్లయ్ ఓవర్లు, ఇతర పనులన్నింటినీ ఈ యేడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది.