కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. అధికారులు కష్టపడి పనిచేస్తున్నా కావాలనే కొందరు కార్పొరేటర్లు తమను టార్గెట్ చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీ అధికారులు మండిపడుతున్నారు. తాము పనిచేయకుంటే ఎక్కడి సమస్యలు అక్కడే ఉండేవని, తమ శక్తి వంచన లేకుండా ఆయా డివిజన్ స్థాయిలో సమస్యలను సరిష్కరిస్తున్నా, నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ హెచ్చరించారు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, GHMC జోనల్ కమీషనర్ మమత.


జీహెచ్ఎంసీ అధికారులకు, ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లకు వివాదం ఇప్పుడు కొత్తకాదు. అనేక సందర్భాల్లో ముఖ్యంగా GHMC పాలకమండలి సమావేశం జరిగినప్పుడల్లా తెరపైకి రావడం, ఆ తరువాత కొద్ది రోజులకు సద్దుమణగడం జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలపై బీజేపీ కార్పొరేటర్లు, అధికార పార్టీని నిలదీస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కాస్త విమర్షల మోతాదు ఎక్కువై ఈ మధ్య అధికారులను టార్గెట్ చేసే పనిలో పడ్డారు కొందరు కార్పొరేటర్లు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్లపై ఒత్తిడి ఉండడం నిజమే. కానీ ఆ పనులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరించుకోవడం పక్కన పెట్టి సహనం కోల్పోతున్న ఘటనలు ఎక్కువవడంతో ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారి, ఏకంగా ఇకపై నోరు జాగ్రత్త అనే స్థాయికి వచ్చేసిందని చెప్పవచ్చు.


తాజాగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం బై కాట్ చేసిన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులతో పాటు రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం సమావేశంలో ఈ విషయంపై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ కార్పొరేటర్లు అధికారుల పట్ల అనుచిత ధోరణికి నిరసనగా కౌన్సిల్ సమావేశం బై కాట్ చేసినట్లు గెజిటెడ్ అధికారుల సంఘం తెలిపింది. వివరాల్లోకి వెళితే నిన్న జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఎటువంటి సంస్కారం, పద్ధతి లేకుండా అధికారుల కార్యాలయం ఛాంబర్లో సీల్ట్ వేయడం, అధికారులపై అనుచితంగా మాట్లాడటంపై జీహెచ్ఎంసీ అధికారులు ఖండించారు. జలమండలి అధికారులకు మద్దతుగా కౌన్సిల్ సమావేశం బైకాట్ చేసారు. కార్పొరేటర్ల సమస్యలను సర్కిల్ నుండి జోనల్ వరకు అధికారులు ఆయా సమస్యలను విని సామరస్యంగా పరిష్కరించడం కోసం కృషి చేస్తున్నప్పటకి ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు.జీహెచ్ఎంసీ అధికారులతో పాటు జలమండలి అధికారులు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కార్పొరేటర్లు ఇష్టమొచ్చినట్లుగా మాట్లడం మానుకోవాలని హెచ్చరించారు.


నోటికొచ్చినట్లు మాట్లాడమే కాకుండా అధికారులదే తప్పు అని అధికారులపై వేయడంతోపాటు అందరి ముందు అన్ పార్లమెంటరీ పదాలతో ఇష్టమైన రీతిలో తిట్టడం అధికారులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దాడి చేయడం జరుగుతోందని, దీంతో ఆఫీసర్ చేసిన పనికి గుర్తింపు లేకుండా ప్రవహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు ఇష్టమొచ్చినట్లు మాట్లడం వల్ల పనులు జరగడంలేదని అధికారులు కల్పించుకుని పనిచేసిన కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం అవార్డులతో పాటు అభివృద్ధి సాధించడానికి ముఖ్య కారణం అన్నారు మమత. ఉద్యోగులను అవమానపరిచే విధంగా జనరల్ బాడీలో మాట్లాడటం ఖండిస్తున్నామని అన్నారు. ఇక నుండి ఈ విధంగా ప్రవర్తించిన కార్పొరేట్లకు ఎవ్వరు కూడా ఒక్క అధికారి కూడా సహకరించబోరని, ఇకనుంచి కార్పొరేటర్లు అధికారులపై మర్యాదగా ప్రవర్తించాలని కోరారు.