వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సీబీఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఇటీవల తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ హత్య కేసుకు సంబంధించిన కీలక వివరాలను సీబీఐ కౌంటర్ లో దాఖలు చేసింది. అవినాష్ ని అరెస్టు చేసి కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సీబీఐ పేర్కొంది. ఆయన ఉద్దేశపూరితంగానే తమ దర్యాప్తునకు సహకరించట్లేదని సీబీఐ చెప్పింది. తమ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు అవినాష్ రెడ్డి సమాధానాలు దాటవేస్తున్నారని, వాస్తవాలు చెప్పట్లేదని సీబీఐ అధికారులు వెల్లడించారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించే విధంగా అవినాష్ రెడ్డి సమాధానాలు ఉంటున్నాయని వెల్లడించింది. దర్యాప్తు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినట్లు సీబీఐ వెల్లడించింది.
హత్యకు వినియోగించిన గొడ్డలిపై ఆరా
వివేకానంద రెడ్డి హత్యకు వాడిన గొడ్డలి ఎక్కడ ఉందో కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ కౌంటర్ లో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి కోట్లలో జరిగిన లావాదేవీలపై అవినాష్ రెడ్డి విచారణలో తేల్చాల్సి ఉందని కౌంటర్ పిటిషన్ లో వెల్లడించింది. సునీల్ యాదవ్‌తో పాటు అవినాశ్ రెడ్డికి సంబంధమేంటో తెలుసుకోవాలని వివరించింది. హత్య రోజున అవినాష్ రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ ఎందుకు వెళ్లాడనే విషయంపై కూడా స్పష్టత రావాలని, హత్య కుట్రలో ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందేమో తెలుసుకోవాలని సీబీఐ పేర్కొంది. మార్చి 15న అవినాష్ రెడ్డి ఎక్కడెక్కడ ఉన్నారో కన్ఫామ్ చేసుకోవాలో సీబీఐ వెల్లడించింది.
విచారణ వేగం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే వివేక హత్య సమయంలో రాసిన లేఖపై విచారణ చేపట్టారు. అలాగే వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాష్ ను విచారించారు. ఇద్దరినీ కలిసి సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న లక్ష్మీదేవి కుమారుడే ప్రకాష్. తాజాగా ఇతడిని సీబీఐ విచారిస్తోంది. నిన్న పీఏ కృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నేడు మరోసారి కృష్ణారెడ్డి, వంటమనిషి కుమారుడు ప్రకాష్ ను విచారిస్తున్నారు.
మంగళవారం కూడా వివేకా పర్సనల్ అసిస్టెంట్ కృష్ణా రెడ్డిని ప్రశ్నించారు. హత్యకు ముందు వివేకా రాసిన లేఖను కృష్ణా రెడ్డి దాచిపెట్టిన విషయం తెలిసిందే. అధికారులు ఆ విషయంపైనే ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. పగలు 3 గంటలకు కోఠిలోని సీబీఐ ఆఫీస్ కు వచ్చిన పీఏ కృష్ణారెడ్డిని 5 గంటలకు పైగా ప్రశ్నించారు. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన కీలక ఆధారమైన ఆ లెటర్ ను ఎందుకు దాయాల్సి వచ్చిందో, అలా దాయమని ఎవరు చెప్పారో చెప్పాలంటూ కృష్ణారెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ లెటర్ ను మొదట ఎవరు గుర్తించారు, ఆ లెటర్ గురించి మీకెలా తెలిసింది, తర్వాత దాన్ని ఎక్కడ దాచి పెట్టారు, మీ వద్ద లెటర్ ఉన్నట్లు ఇంకా ఎవరితో అయినా చెప్పారా, లెటర్ ను పోలీసులకు ఎన్ని గంటల తర్వాత అప్పగించారు, అప్పటి వరకు లెటర్ ను దాయాల్సిన అవసరం ఏంటి అంటూ అనేక ప్రశ్నలను సీబీఐ అధికారులు సంధించినట్లు తెలుస్తోంది.