Ganza In Singer Mangli Birthday Party: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. టాప్ సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుకలో గంజాయి వాడకం ఆందోళన కలిగించింది. తన పుట్టిన రోజు సందర్భంగా మంగ్లీ మంగళవారం హైదరాబాద్ సమీపంలోని చేవెళ్లలో పార్టీ ఏర్పాటు చేశారు.
చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో.. విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారనే సమాచారం పోలీసులు దాడి చేశారు. విదేశీ మద్యం సీజ్ చేసి.. పార్టీకి హాజరైన 48 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9 మందికి గంజాయి పాజిటివ్‌గా వచ్చిందని పోలీసులు తెలిపారు.
మంగ్లీపై కేసు
ఈ క్రమంలో అనుమతి లేకుండా విదేశీ మద్యం వినియోగించినందుకు సింగర్ మంగ్లీతో పాటు రిసార్ట్ యాజమాన్యంపై చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై విచారణ చేస్తున్నారు. అనుమతి లేకుండా డీజేను ప్లే చేసినందుకు దాన్ని కూడా సీజ్ చేశారు. పార్టీలో పాల్గొన్న వారందరినీ విచారిస్తున్నారు.
Also Read: 'ఆనంద్' To 'కుబేర' - శేఖర్ కమ్ముల కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీస్.. వీటిని మళ్లీ మళ్లీ చూస్తారుగా..
పోలీసుల సోదాల్లో పెద్ద ఎత్తున గంజాయి, వివిధ బ్రాండ్ల విదేశీ మద్యం భారీగా లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు కూడా హాజరైనట్లు సమాచారం. బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు కాసర్ల శ్యామ్, దివి హాజయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఘటనతో అటు టాలీవుడ్‌లో మరోసారి ఆందోళన నెలకొంది. గతంలోనూ టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.
వీరిపై కేసులు
ఈ ఘటనకు సంబంధించి సింగర్ మంగ్లీతో సహా త్రిపుర రిసార్ట్ ఏజీఎం శివరామకృష్ణ, ఈవెంట్ ఆర్గనైజర్ దునే మేఘావత్, ఈవెంట్ ఆర్గనైజర్ ఫ్రెండ్ దామోదర్ రెడ్డి ఇలా మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మొత్తం 48 మంది పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. అందరికీ డ్రగ్స్ టెస్ట్స్ నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చిందని సమాచారం. నిషేధిక గంజాయి సేకరణ, అనుమతి లేకుండా విదేశీ మద్యం వినియోగం, సౌండ్ ఎవెల్యూషన్ వంటి కారణాలతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
తప్పుడు ప్రచారం చెయ్యొద్దు
మరోవైపు.. తనపై తప్పుడు ప్రచారం చెయ్యొద్దని ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ అన్నారు. మంగ్లీ బర్త్ డే పార్టీకి తాను హాజరయ్యానని.. అయితే.. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసే వరకే తాను ఉన్నట్లు చెప్పారు. 'పార్టీకి హాజరైన నేను సెలబ్రేషన్స్ తర్వాత వచ్చేశాను. డ్రగ్స్ విషయం గురించి నాకు తెలియదు. అలాంటి వాటికి నేను దూరం. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. అనవసరంగా నాపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు.' అని పేర్కొన్నారు.
ఫోక్ సింగర్ మంగ్లీ తక్కువ కాలంలోనే తన గాత్రం, సాంగ్స్‌తో తెలుగు ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేశారు. బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, తెలంగాణ ఫోక్ పాటలతో మంచి పేరు సంపాదించుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలకు పాటలు పాడారు. 'పుష్ప' సినిమాలో 'ఓ అంతవా' పాటకు కన్నడ వెర్షన్ పాడిన ఆమె జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఓవైపు సినిమా పాటలు, మరోవైపు ఫోక్ సాంగ్స్, మ్యూజిక్ లైవ్ ఈవెంట్స్‌తో తనదైన క్రేజ్ సంపాదించుకున్నారు మంగ్లీ. ఇప్పుడు తాజాగా వివాదంలో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది.