KCR Attends Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కమిషన్ ఛైర్మన్ పినాకినీ చంద్ర ఘోష్ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటివరకు కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై విచారణకు ఆదేశించిందన్న అంశాలు ఇప్పుడు చూద్దాం.
1. ప్రాజెక్టు అంచనా వ్యయం అసాధారణ రీతిలో పెంపు
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెంచారని, ఇది అసాధారణంగా ఉందన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రధాన ఆరోపణ. ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో రూ. 38,500 కోట్లకు అంచనా వేస్తే, ఆ తర్వాత ఈ అంచనా వ్యయాన్ని రూ. 1.20 లక్షల కోట్లకు పెంచారని కాంగ్రెస్ వాదిస్తోంది. కమీషన్ల కోసమే తప్ప, అంచనా వ్యయం పెంచడానికి సరైన కారణం లేదన్నది కాంగ్రెస్ వాదన. ప్రాజెక్టు పనికి అయ్యే ఖర్చు కన్నా ఎన్నో రెట్లు ఖర్చు పెరగడానికి కారణం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతే అన్న ఆరోపణ కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు.
2. కాళేశ్వరం డిజైన్లో, నిర్మాణంలో నాణ్యతా లోపాలు
కాళేశ్వరం డిజైన్ తప్పు అన్నది కాంగ్రెస్ పార్టీ వాదన. డిజైన్ లోపభూయిష్టంగా ఉంది. అంతే కాకుండా నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలను కనీస మాత్రం పాటించలేదన్నది మరో ఆరోపణ. డిజైన్ల లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురయిందని ఉదాహరణగా చెబుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని చెబుతోంది. ప్రాజెక్టులో ఎన్నో లీకేజీలు, పగుళ్లు ఉన్నాయని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని పదే పదే చెబుతుంటే, ఇది ఇంజనీరింగ్ వైఫల్యంగా కాంగ్రెస్ అభివర్ణించింది.
3. రాష్ట్రంపై రుణ భారం రుద్దిన కాళేశ్వరం ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నాటి ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు తీసుకుందని, కానీ ఆ మొత్తాన్ని ప్రాజెక్టును నాణ్యతతో నిర్మించకుండా నిధులను దుర్వినియోగం చేసిందన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఇది తెలంగాణ భవిష్యత్తు తరాలకు మోయలేని రుణ భారంగా కానుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రాజెక్టు ప్రారంభంలో చెప్పిన రీతిలో సాగునీరు అందలేదని, కానీ వేల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు జరిగిందని, ప్రజాధనాన్ని గులాబీ పార్టీ దుర్వినియోగం చేసిందని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ డబ్బులు ఎవరి ఖజానాలోకి చేరాయన్నది తేలాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
4. మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చడం వెనుక కుట్ర
బీఆర్‌ఎస్ సర్కార్‌కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద తక్కువ అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. అయితే దాన్ని కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డకు మార్చారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నది కాంగ్రెస్ ఆరోపణ. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీరు పారే అవకాశం ఉందని, చాలా తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చని చెబుతోంది. 80 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు రూపకల్పన చేస్తే, దాన్ని మేడిగడ్డకు మార్చడం వల్ల వ్యయం పెరిగిందని, అది కమీషన్ల రూపంలో గులాబీ నేతల జేబుల్లోకి వెళ్లాయన్నది ప్రధాన ఆరోపణ.
5. కాళేశ్వరం పనులు పారదర్శకంగా జరగలేదు
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కేసీఆర్ ప్రభుత్వం పారదర్శకత పాటించలేదన్నది మరో ఆరోపణ. పనుల పర్యవేక్షణలో పూర్తిగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, దీనికి కేసీఆర్ బాధ్యుడు అన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. దీనిపై అవినీతి ఆరోపణలు వస్తే కనీసం మాత్రం పట్టించుకోకపోవడం ఉద్దేశపూర్వకమైన చర్యగా హస్తం నేతలు చెబుతున్నారు.
6. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుతో ప్రజా ధనం వృథా
తెలంగాణ పొలాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆశించిన ఫలితాలు ప్రజలకు దక్కలేదని కాంగ్రెస్ చెబుతోంది. బ్యారేజీలు కుంగిపోవడం, పిల్లర్లు దెబ్బతినడం ద్వారా ప్రజల సొమ్ము వృథా అయిందని హస్తం నేతల తీవ్ర ఆరోపణ. దీనిపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.