KCR : కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో మాజీ సీఎం కేసీఆర్ విచారణ పూర్తి అయింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ ఆయన్ని కమిషన్ విచారించింది. అనుమానం ఉన్న వివిధ అంశాలపై ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్‌లో జరిగే పీసీ ఘోష్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఆయన్ని కమిటీ హాల్‌లోకి తీసుకెళ్తే తనకు వేరుగా విచారించాలని రిక్వస్ట్ చేశారు కేసీఆర్. ఆయన అభ్యర్థనను ఘోష్ అంగీకరించారు. మిగతా నాయకులను బయటకు పంపేశారు. కేసీఆర్‌ను ఓ రూమ్‌లో ఉంచి ప్రశ్నలు అడిగినట్టు సమాచారం అందుతోంది.
జలుబు ఉందని అందుకే తాను గట్టిగా మాట్లాడలేనని కేసీఆర్ చెప్పారని సమాచారం. ఎక్కువ మంది ఉన్న హాల్‌లో విచారిస్తే తన మాట సరిగా వినిపించకపోవచ్చని కూడా వివరించారు. ఆయన అభ్యర్థనను మన్నించిన పీసీఘోష్ కమిషన్ ఒంటరిగా ప్రత్యేక రూమ్‌లో విచారించేందుకు ఓకే చెప్పింది. విచారణ సందర్భంగా తన వెంట తెచ్చుకున్న కీలకమైన డాక్యుమెంట్స్‌ను కూడా కేసీఆర్ అధికారులకు వివరించారని తెలుస్తోంది.
విచారణ అనంతరం కేసీఆర్ నేరుగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బాత్రూమ్‌లో రాజేశ్వర్‌రెడ్డి జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలు విరిగినట్టు తెలుస్తోంది. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన్ని కవిత పరామర్శించి వచ్చారు. విచారణ అనంతరం కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించారు.