Gadwal MLA Krishna Mohan Reddy: తెలంగాణలో వలసలు జోరుగా సాగుతున్న టైంలో గద్వాల్ ఎమ్మెల్యే ఇచ్చిన స్ట్రోక్‌కి మొత్తం కథే మారిపోయింది. కాంగ్రెస్‌లోకి వచ్చిన నెల రోజులు కాకముందే తిరుగుపయనం అవుతున్నారన్న పుకార్లతో అధికార పార్టీ అలర్ట్ అయింది. ఇలా వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి సొంతగూటికి వెళితే జరిగే ప్రమాదాన్ని గ్రహించి చర్చలు ప్రారంభించింది. 


శాసనసభ సమావేశాలు జరుగుతున్న టైంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దేవరకద్ర ఎమ్మల్యే మధుసూదన్‌రెడ్డితోపాటు గద్వాల వెళ్లి మంతనాలు జరిపారు. చాలా సమయం ఈ చర్చలు జరిగాయి. అనంతరం మీడియాతో మాట్లాడిన జూపల్లి... కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని ప్రకటించారు. పాత పరిచయాల కారణంగా ఆయన బీఆర్‌ఎస్ నేతలతో మాట్లాడరే తప్ప కారు ఎక్కే ఉద్దేశం ఆయనకు లేదని అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు జూపల్లి. ర్యాలంపాడు రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీరు నిల్వచేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని అన్నారు. కాంగ్రెస్‌లో వర్గపోరుకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. పార్టీ కోసం పని చేసే వారికి కచ్చితంగా ఏదో రూపంలో గుర్తింపు ఉంటుందని చెప్పుకొచ్చారు. 


చర్చల తర్వాత తనతోపాటు కృష్ణమోహన్ రెడ్డిని హైదరాబాద్‌ తీసుకొచ్చారు జూపల్లి కృష్ణారావు. గురువారం హైదరాబాద్‌ వచ్చిన కృష్ణమోహన్ రెడ్డి ఈ ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అసలు కేటీఆర్‌ను ఎందుకు కలవాల్సి వచ్చింది. తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లబోతున్నట్టు పుకార్లు ఎలా వచ్చాయనే దానిపై వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గ సమస్యల చిట్టాను కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచారు.