Gaddar Funeral : ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ తెలంగాణ గర్వించే బిడ్డ అని సీఎం కేసీఆర్ అన్నారు. జీవితాంతం వారు చేసిన త్యాగాలు ప్రజా సేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.


ముగిసిన ప్రజా యుద్ధనౌక ప్రస్థానం.. 
గద్దర్ అంత్యక్రియలు హైదరాబాద్ లో సోమవారం జరగనున్నాయి.  సోమవారం (ఆగస్టు 7న) మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతియయాత్ర ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం వరకు ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహం ఉంచారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆల్వాల్ కు గద్దర్ భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆల్వాల్ లో గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ప్రజా గాయకుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గద్దర్ భార్య విమల తన నిర్ణయాన్ని తెలిపారు. అయితే అంతిమయాత్రలో భాగంగా గద్దర్ భౌతికకాయాన్ని కొంతసేపు భూదేవి నగర్ లోని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. 


ప్రజా గాయకుడు గద్దర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఇటీవల ఆయనకు గుండె ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ కావడంతో, అంతా బాగానే ఉందని డాక్టర్లు, కుటుంబ సభ్యులు సైతం ప్రకటించారు. త్వరలోనే తాను గళం విప్పుతానని ప్రజా గాయకుడు సైతం ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ ఉపిరితిత్తుల ఇన్ ఫెక్షన్, యూరినరీ సమస్యలు తీవ్రతరం కావడంతో ఆరోగ్యం విషమించింది. నేటి ఉదయం ఒక్కసారిగా పెరిగిన బీపీని కంట్రోల్ చేసే సమయంలోనే గద్దర్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోయాయి. శరీరంలోని అవయవాలు చికిత్సకు స్పందించకపోవడం, కిడ్నీ, లివర్ పని మందగించడంతో ప్రజా యుద్ధనౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు.


ప్రముఖుల దిగ్భ్రాంతి, నివాళులు..
గద్దర్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని, ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని గుర్తుచేసుకున్నారు. నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికిన గద్దర్ మరణం ఊహించలేమన్నారు. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోందన్నారు. “ప్రజా గాయకుడు” గద్దర్ మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలియచేశారు. తన పాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన “ప్రజా యుద్ధనౌక” గద్దర్ అని కొనియాడారు. 


రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతల సంతాపం.. 
తెలంగాణలో దిగ్గజం, ఉద్యమకారుడు గుమ్మడి విట్టల్‌రావు మరణం తనను చాలా బాధించిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ. తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ప్రేమే అణగారిన వర్గాల కోసం అలుపెరగకుండా పోరాడేలా చేసిందన్నారు. గద్దర్ తెలంగాణ పోరాట యోధుడు.. తెలంగాణ సాధన కోసం తన ఆట, పాటలతో జనాన్ని ఉతేజపరిచారు అని రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం పట్ల అపార అభిమానం ఉన్న వ్యక్తి గద్దర్. గద్దర్ మృతికి సంతాప సూచకంగా కాంగ్రెస్ శ్రేణులు అన్ని మండల కేంద్రాలలో ముఖ్య కూడళ్లలో గద్దర్ చిత్ర పటాలు పెట్టి నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.